Site icon Prime9

Delhi Rains: డేంజర్ బెల్స్ మోగిస్తోన్న యమునా నది.. ఢిల్లీ ప్రాంత వాసులకు అలెర్ట్

Delhi Rains: ఉత్తరభారతాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగాయి. వేల మంది ప్రజలు నిరాశ్రయలు అయ్యారు. వంద మంది ఈ వరదల వల్ల ప్రాణాల విడిచారు. కాగా మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న చాలా మంది ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీ ప్రజలను యమున నది భయపెడుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది అత్యంత ప్రమాదకర స్థాయికి నీటి మట్టం చేరుకుంది. యమునా నదిలో ప్రస్తుతం 207.18 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. గత పదేళ్ల తరువాత యమునా నది నీటిమట్టం ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. గతంలో2013‌లో 207.32 మీటర్ల వరకు యమున నదిలో వరద ప్రవాహం చేరుకుంది. హర్యానాలోని హతినికుండ్ బ్యారేజ్ నుంచి నీటి విడుదలతో యమునా నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది.

పదేళ్లలో ఇదే తొలిసారి(Delhi Rains)

దానితో యమునా నదిలో వరదనీరు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తుంది. వలస కార్మికులు, రైతు కూలీలు నివాసాలుండే ఐటీఓ, మయూర్ విహార్, లక్ష్మీ నగర్, యమునా బజార్‌లో రోడ్లపై వరదనీరు ప్రవహిస్తుంది. దీనితో ఆ ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో ఉండడంతో ఆ ప్రాంత ప్రజలంతా రోడ్డున పడ్డారు. యమునా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కోసం ఢిల్లీ ప్రభుత్వం పునరావాస కేంద్రాలు, తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేసింది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

యమునా నదిలో అత్యధిక వరద స్థాయి 207.49 మీటర్లుగా కాగా 1978 సెప్టెంబర్ 6న 207.49 మీటర్లకు యమునా నీటి మట్టం చేరింది. మరోవైపు ఢిల్లీలో వరద పరిస్థితులపై 16 కంట్రోల్ రూమ్స్ , క్విక్ రెస్పాన్స్ టీమ్స్, 47 రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచింది. యమునా నది నీటిమట్టం పెరగడంతో తొమ్మిది ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. సీలంపూర్ కిసాన్ బస్తీ, సోనియా విహార్‌లోని ఎంసీడీ టోల్, పాత ఇనుప వంతెన, ఐఎస్బీటీ ఉన్న కిసాన్ బస్తీ, అన్నపూర్ణ మందిర్, ఉస్మాన్‌పూర్ పుస్తా, బదర్‌పూర్ ఖాదర్ విలేజ్, సబ్‌పూర్ బస్ టెర్మినల్, గర్హి మండు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో ఆ ప్రాంతాల్లోని నివాసదారులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Exit mobile version