Site icon Prime9

Deep Fake Videos: దేశంలో డీప్ ఫేక్ వీడియోల కలకలం.. అమిత్ షా వీడియోతో మరో సారి చర్చనీయాంశం

Deep Fake Videos

Deep Fake Videos

 Deep Fake Videos: ప్రస్తుతం డీప్‌ ఫేక్‌ వీడియోల జమానా నడుస్తోంది. మనిషిని పోలిన మనిషి తయారు చేయడం .. చెప్పని విషయాలు చెప్పినట్లు సృష్టించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో సినీతారల డీప్‌ ఫేక్‌ వీడియోలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు డీప్‌ ఫేక్‌ వీడియోలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. అమిత్ షా డీప్‌ పేక్‌ వీడియోకు సంబంధించి రేవంత్‌ రెడ్డికి డిల్లీ పోలీసుల నుంచి నోటీసులు అందాయి. బుధవారం హాజరై వీడియోల గురించి వివరణ ఇవ్వాలని కోరింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ శరవేగంగా మారిపోతోంది. అదే సమయంలో ఈ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తుంటే.. రాజకీయ పార్టీలు కూడా తమకు అనకూలంగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం లోకసభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రాజకీయ నాయకులు యావత్‌ దేశం చుట్టి వస్తూ.. పలు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడుతుంటారు. వారి మాటలను మార్చి వారి వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం తాజాగా జరుగుతున్న తంతు. అయితే ఈ నెల 23న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో చెవెళ్ల బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలను తారుమారు చేస్తూ ఫేక్‌ వీడియోను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌లో ఈ నెల 27న పోస్ట్‌ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వీడియోలు అందుబాటులో లేవు. విత్‌డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక అమిత్‌ షా ఫేక్‌ వీడియో విషయానికి వస్తే..ఒక వేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్‌సీ, ఎస్‌టీ, ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఉంది. ఇక ఒరిజినల్‌ వీడియోను చూస్తే ఆయన చెప్పింది తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లిం ఓట్లను దండుకొనేందుకు ముస్లింలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాస్తవానికి ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు కేటాయించిన రిజర్వేషన్ల నుంచి ఈ నాలుగు శాతం తీసుకున్నారు కాబట్టి .. వారికి చట్టప్రకారం దక్కాల్సిన రిజర్వేషన్లు వారికి అప్పగిస్తామని.. వారి హక్కులను పరిరక్షిస్తామని చెవేళ్ల బహిరంగసభలో అమిత్‌ షా మాట్లాడుతూ అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు..( Deep Fake Videos)

ఇక ఈ ఫేక్‌ వీడియోలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. రంగంలోకి దిగిన పోలీసులు డిల్లీ, అస్సాం, మహారాష్ర్టలో మూడు ప్రత్యేక కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అస్సాంకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తను అరెస్టు చేశారు. కాగా ఈ వివాదంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్‌ ఆఫీస్‌ బేరర్లకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. దిల్లీ పోలీసులు వీరికి సెక్షన్‌ 91 ఐపీసీ కింద సమన్లు జారీ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కూడా బుధవారం నాడు డిల్లీ పోలీసుల ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కాగా ఈ వీడియోను మార్చి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాబట్టి ఈ వీడియోకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని దిల్లీ పోలీసు వర్గాలు చెప్పాయి. ఒక వేళ రేవంత్‌ రెడ్డి బుధవారం నాడు డిల్లీ పోలీసుల ముందు హాజరు కాకపోతే.. మరో నోటీసు పంపుతారు. వాస్తవానికి ఈ వీడియోను పోస్ట్‌ చేసిన రోజునే తెలుగు యూజర్‌ ఇది ఫేక్‌ అని కనుగొన్నాడు. ఆ యూజర్‌ను కూడా విచారణకు రావాలని పోలీసులు ఆదేశించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా నోటీసులు అందుకున్న రేవంత్‌ రెడ్డి దీనిపై ఘాటుగా స్పందించారు. లోకసభ ఎన్నికల సందర్బంగా ఆయన కర్నాటకలోని కలబుర్గిలో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇలాంటి నోటీసులకు తాను భయపడనని.. ఎన్నికల్లో గెలవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ఈడీ, సీబీఐ, ఐటి శాఖను తమపై ఉసిగొల్పుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు దిల్లీ పోలీసు బృందం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసుకు వచ్చిందని తనకు తెలిసిందని, సోషల్‌ మీడియాలో ఏదో పోస్టు చేశారని వచ్చారని చెప్పారు. దీని అర్ధం ఏమిటంటే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలనేది ప్రధానమంత్రి, హోంమంత్రి ఉద్దేశమన్నారు రేవంత్‌., ఎన్నికల్లో గెలవడానికి వారు దిల్లీ పోలీసును వినియోగించుకుంటోందన్నారు. అయినా.. తాము భయపడేది లేదన్నారు రేవంత్‌.

ఫేక్ వీడియో కేసులో అరెస్ట్

ఇక అస్సాం ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వాస్‌ శర్మ కూడా డీప్‌ ఫెక్‌ వీడియో గురించి స్పందించారు. తన రాష్ర్టంలో రీతమ్‌ సింగ్‌ అనే వ్యక్తిని ఫేక్‌ వీడియో కేసుకు సంబంధించి అరెస్టు చేశామని చెప్పారు. ఈ విషయాన్ని అస్సాం సీనియర్‌ పోలీసు అధికారులు కూడా ధ్రువీకరించారు. 31 ఏళ్ల సింగ్‌ వృత్తి రీత్యా గౌహతి హైకోర్టు లాయర్‌, కాంగ్రెస్‌ అస్సాం యూనిట్‌ వార్‌ రూం కో ఆర్డినేటర్‌ అని తేలింది. ఇక దిల్లీ పోలీసులు కూడా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ ఉదాహరణకు ఫేస్‌బుక్‌తో పాటు ఎక్స్‌లో అమిత్‌ షా వీడియోను ఎవరు పోస్టు చేశారో కనుగొనాలని కోరింది. ఇదిలా ఉండగా సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రసారం చేస్తున్న క్రమంలో హోంమంత్రిత్వశాఖ దిల్లీలో పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. దీంతో ఆదివారం నాడు దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని పలు సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ముంబై పోలీసులతో పాటు అస్సాం పోలీసులు కూడా ఐపీసీతో పాటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్డ్‌ లోని పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. ముంబైలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎక్స్‌ ఖాతా నుంచి 17 హ్యాండిల్స్‌,అలాగే నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ శరద్‌ పవార్‌కు చెందిన పార్టీకి చెందిన సానుభూతి పరులు ఎక్స్‌ ద్వారా ఫేక్‌ వీడియోలు విడుదల చేశారు. ఇదిలా ఉండగా కర్ణాటకలో ప్రధానమంత్రి నరేంద్ర మోది డీప్‌ ఫేక్‌ల గురించి ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు టెక్నాలజీ ద్వారా ఫేక్‌ వీడియోలను, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకొని తప్పుడు సమాచారం ప్రచారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్‌ కమిషన్‌ తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతానన్నారు మోదీ.

ఫేక్ వీడియోలపై కఠిన చర్యలు..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌ రెడ్డి ఫేక్‌ వీడియోలపై మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం పట్ల కాంగ్రెస్‌ పార్టీప కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని తాము తేలికగా వదలబోమని.. సీఎంను కూడా కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. ఇక కేంద్ర మంత్రి అమిత్‌ షా బుధవారం నాడు ఫేక్‌ వీడియోల గురించి ప్రస్తావించారు. . ఇలాంటి ఫేక్‌ వీడియోలు చలామణిలో ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్‌ షా గువాహతిలో మాట్లాడుతూ అన్నారు. ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి ఫెక్‌ వీడియోలను ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందన్నారు. తెలంగాణలోని చెవేళ్లలో తాను చేసిన ప్రసంగం గురించి ఎక్స్‌లో ప్రస్తావించారు అమిత్‌ షా.. దేశంలోని ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ సోదరులు, సోదరిమణులకు రిజర్వేషన్‌ వారి హక్కు అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ముస్లింలకు ఇండియా కూటమి రిజర్వేషన్లు కల్పించింది. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీల కోటా ను తగ్గించి ముస్లింలకు ఆ నాలుగు శాతం కోటాను వారికి అప్పగించింది. కాంగ్రెస్‌ పార్టీ తాను చేయని ప్రసంగాల ఫేక్‌ విడుదల చేసి ప్రజలన తప్పుదోవ పట్టిస్తోందన్నారు. చట్టవ్యతిరేకంగా ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పానని అమిత్‌ షా తాను చేవేళ్ల చేసిన ప్రసంగం గురించి వివరించారు.

మొత్తానికి చూస్తే డీప్‌ ఫేక్‌ వీడియోలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఇక అందరి దృష్టి బుధవారం రేవంత్‌ రెడ్డి దిల్లీ పోలీసుల ముందు హాజరవుతారా లేక వాయిదా కోరతారా అన్న టాక్‌ వినిపిస్తోంది. ఎన్నికల టైం కాబట్టి కొంత గడువు కోరే అవకాశం ఉందన్న టాక్‌ హైదరాబాద్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Exit mobile version