Haryana clashes: హర్యానా ఘర్షణల్లో ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. ఢిల్లీలో హై అలర్ట్

హర్యానాలోని నుహ్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్‌పీ) ఊరేగింపుపై దాడిని పెద్ద కుట్రలో భాగమని అభివర్ణించారు. మరోవైపు వీహెచ్‌పీ జాతీయ దర్యాప్తు సంస్ద ద్వారా విచారణకు డిమాండ్ చేసింది.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 12:53 PM IST

Haryana clashes: హర్యానాలోని నుహ్ జిల్లాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్‌పీ) ఊరేగింపుపై దాడిని పెద్ద కుట్రలో భాగమని అభివర్ణించారు. మరోవైపు వీహెచ్‌పీ జాతీయ దర్యాప్తు సంస్ద ద్వారా విచారణకు డిమాండ్ చేసింది.

నుహ్ జిల్లాలో మంగళవారం ఉదయం అధికారులు కర్ఫ్యూ విధించారు. భద్రతా బలగాలు చుట్టుపక్కల జిల్లాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించగా, అనేక శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించబడ్డాయి. హింసాకాండ నేపథ్యంలో పరిసర జిల్లాలైన నుహ్ – ఫరీదాబాద్, పల్వాల్ మరియు గురుగ్రామ్‌లలో భద్రతను పటిష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, సాధారణ పరిస్థితులు నెలకొని మార్కెట్లు ప్రారంభమయ్యాయని గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ యాదవ్ మంగళవారం తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల వరకు హర్యానాలో మతపరమైన అల్లర్లు జరగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా అన్నారు. ఈరోజు తొలిసారిగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వ పాలనలో అల్లర్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.

116 అరెస్టులు.. 41 ఎఫ్‌ఐఆర్‌లు..(Haryana clashes)

మత ఘర్షణల నేపథ్యంలో హర్యానా పోలీసులు 116 మందిని అరెస్టు చేసి 41 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లో జరిగిన తాజా హింస ఢిల్లీని అప్రమత్తం చేసింది. గురుగ్రామ్‌లోని సోహ్నా సబ్-డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం మూసివేయాలని ఆదేశించారు.నూహ్‌ ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని నిర్మాణ్‌ విహార్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని యోచిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మేవాత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ( వీహెచ్‌పీ) ఈరోజు నిరసనకు పిలుపునిచ్చింది. మనేసర్‌లోని భీసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్‌కు వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ పిలుపునిచ్చాయి. వీహెచ్‌పీ బుధవారం నోయిడాలో ప్రధాన ప్రదర్శన కూడా నిర్వహించనుంది. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం నుంచి సెక్టార్ 16లోని రజనిగంధ చౌక్ వైపు నిరసన ప్రదర్శన ప్రారంభమవుతుందని, అక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వీహెచ్‌పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు.