Site icon Prime9

Covid-19 cases surge: కోవిడ్-19 కేసుల పెరుగుదల.. సంసిద్ధతను అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్

COVID-19 cases surge

COVID-19 cases surge

Covid-19 cases surge: దేశంలో కరోనా మహమ్మారి మరోమారు చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో సౌకర్యాలపై నేటి నుంచి రెండు రోజుల పాటు మాక్‌ డ్రిల్‌ ప్రారంభించింది.

మాక్ డ్రిల్ ఎందుకంటే.. (Covid-19 cases surge)

కొవిడ్‌ నిర్వహణ సంసిద్ధతను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇవాళ మాక్‌ డ్రిల్‌ మొదలుపెట్టగా.. రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ వసతి ఉన్న బెడ్‌లు, వెంటిలేటర్‌, ఐసీయూ బెడ్‌ల వివరాలను ఈ మాక్‌డ్రిల్‌లో సేకరించనున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల వివరాలను తెలుసుకోనున్నారు. దీంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు, కిట్ల లభ్యత, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు (ఎన్‌-95), వెంటిలేటర్ల సంఖ్య వంటి కీలక అంశాలు గుర్తించి వైద్యారోగ్య శాఖకు నివేదిస్తారు. వీటన్నింటిని పరిశీలించి వైరస్‌ను ఎదుర్కొనే సంసిద్ధతపై కేంద్ర వైద్యారోగ్యశాఖ అంచనా వేస్తుంది. హరియాణాలోని ఝజ్జర్‌ ఎయిమ్స్‌లో జరిగిన మాక్‌ డ్రిల్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పరిశీలించారు.

కరోనా కేసుల పెరుగుదల..

ఇదిలా ఉండగా దేశంలో తాజాగా 5,880 కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.91శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ కారణంగా నిన్న 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు చొప్పున మరణాలు నమోదవ్వగా.. కేరళలో ఇద్దరు, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌లో ఒక్కొక్కరు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 35,199కి పెరిగింది.

Exit mobile version