Coromandel Express: ఘోర రైలు ప్రమాదంలో బోగీల నుంచి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతోంది. ఘటనా స్థలి వద్ద ఎన్డీఆర్ఎఫ్ తో సహా భారత ఆర్మీ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది. ప్రమాదంలోని గాయపడిన క్షతగాత్రులకు భువనేశ్వర్, బాలేశ్వర్, భద్రక, మయూక్ భంజ్, కటక్ లోని హాస్పిటల్స్ చికిత్స అందిస్తున్నారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా జరిగిన ప్రమాదం.. 2009 లో జరిగిన రైలు ప్రమాదాన్ని గుర్తుకు తెస్తోంది. 2009 లో ఇదే కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు సరిగ్గా శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రమాదం సంభవించింది.
ఆరోజు కూడా శుక్రవారమే(Coromandel Express)
సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 13, 2009.. ఒడిశాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం జరిగింది. ఆ రోజు కూడా శుక్రవారమే కావడం గమనార్హం. రాత్రి 7.30 నుంచి 7.40 మధ్య అప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ రోజు అత్యంత వేగంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ జైపుర్ రోడ్ రైల్వే స్టేషన్ దాటుతోంది. ట్రాక్ మార్చుకునే సమయంలో రైలు పట్టాలు తప్పి బోగీలు విడిపోయాయి. బోగీలన్నీ చెల్లాచెదురుగా పడగా.. ఇంజిన్ మరో ట్రాక్ మీద పడింది. ఆ రోజు జరిగిన ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు.
ప్రమాద స్థలికి శ్రీకాకుళం ఇంఛార్జ్ కలెక్టర్
ఇదిలా ఉంటే.. రైలు ప్రమాద ఘటనా స్థలికి శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికుల సమాచారం తెలుసుకునేందుకు ఆయన వెళ్లినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ – 08942 240557 ను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో తెలుగు వారు 178 మంది ఉన్నారు. మృతులు, క్షతగాత్రులు , మిస్ అయిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖ పట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లాల కలెక్టరేట్ లో కంట్రోలో రూమ్ లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.