Inheritance Tax Row:ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లోని బాంస్వారాలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఇక మోదీ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే.. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని సంపదతో పాటు తల్లుల, సోదరి మణుల బంగారం లెక్క వేసి దేశంలోకి అక్రమ చొరబాటు దారులకు… ముస్లింలకు సమానంగా పంచుతామని ప్రకటించింది. మహిళల మంగళసూత్రాలకు కూడా భరోసా ఉండదు అంటూ ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాలను ప్రస్తావించారని మోదీ అన్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.
శ్యామ్ పిట్రోడా ఏమన్నారంటే..(Inheritance Tax Row)
ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా చేసిన ప్రకటన కాస్తా పెద్ద వివాదానికి తెరతీసింది. ఆయన చెప్పింది ఏమిటంటే అమెరికాలో మాదిరాగానే ఇండియాలో కూడా వారసత్వ పన్ను తీసుకురావాలని సూచించారు. ఒక వేళ వ్యక్తి మరణిస్తే 55 శాతం సంపదను ప్రభుత్వం తీసుకుంటుంది. ఉదాహరణకు అమెరికాలో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుంటే.. ఆయన సంపద 10 మిలియన్ డాలర్లు అనుకుంటే..ఆయన ఆస్తిలో ప్రభుత్వం 55 శాతం తీసుకుంటే 45 శాతం ఆయన పిల్లలకు చెందుతుంది. అలాంటి విధానాలను ఇండియాలో కూడా చర్చించాలన్నారు. ప్రజలకు అనుకూలంగా ఉండే విధానాలను తీసుకురావాలని.. సంపన్నుల కోసం కాదని పిట్రోడా అన్నారు. పిట్రోడా ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాస్తా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజీ తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదంటున్నారు. డ్యామేజీ కంట్రోల్‌కు పార్టీ సీనియర్లు నడుంబిగించారు. రాహుల్ గాంధీ కూడా దిల్లీలో మీడియా సమావేశం పెట్టి మేనిఫెస్టోలో ప్రజల సంపద తీసుకొని పేదలకు పంచుతామని చెప్పలేదని వివరణ ఇచ్చుకున్నారు.
2024 లోకసభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రధానంగా ఆర్థిక అసమాన్యతల గురించి ప్రస్తావించింది. సమాజంలో కొన్ని వర్గాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని పేర్కొంది. వారికి ప్రభుత్వ భూములు, వనరులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన న్యాయపత్రలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన వారితో పాటు కులగణన జరుగుతుంది. కులాలు, ఉపకులాలు, వారి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా గణాంకాలను సేకరించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
ఇక కాంగ్రెస్‌పార్టీ మైనార్టీల గురించి కూడా ప్రస్తావించింది. ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీలను ఆదుకొనేందుకు బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇవ్వాలని ..రుణాలు ఇవ్వడంలో ఎలాంటి తారతమ్యం చూపించరాదని కోరుతామని న్యాయపత్రలో పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ధనవంతుల నుంచి సంపద తీసుకొని పేదలకు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. అయితే పార్టీ మాత్రం కులాల ప్రాతిపదికన జనాభా గణాంకాలను చేపడుతుందని..దాని ప్రకారం విధానాల పరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. రాహుల్ ఈ కుల గణాంకాలను ఇండియాను ఎక్స్ -రే తీస్తున్నట్లు అభివర్ణించారు. సంపద అందరికి దక్కేలా పాలసీలను మారుస్తామని ప్రకటించింది. కానీ ప్రజల సంపదను, బంగారాన్ని తీసుకొని పేదలకు.. ముస్లింలకు పంచుతామని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.