Site icon Prime9

Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు.. దిగ్విజయ్ సింగ్ x శశిథరూర్‌

Congress

Congress

New Delhi: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటివరకూ అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ మధ్య పోటీ ఉంటుందని, ఇందులోనూ అధిష్టానం ఆశీస్సులున్న గెహ్లాట్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమేనని అంతా భావించారు. కానీ రాజస్థాన్‌లో అధికారం వదులుకునేందుకు ఆయన ససేమిరా అనడంతో సీన్ మొత్తం మారిపోయింది. రాజస్థాన్‌లో తన వారసుడిని తానే ఎంచుకునేందుకు సిద్ధం కావడం, అందుకు అధిష్టానం ఒప్పుకోకపోవడంతో కథ మొదటికి వచ్చింది. తిరుగుబాటుకు ప్రయత్నించడంతో గెహ్లాట్ ఒంటరి అయ్యారు. అదే సమయంలో అధ్యక్ష ఎన్నికల రేసులోనూ మరికొందరి పేర్లు దూసుకొచ్చాయి.

అనూహ్య మలుపులు తిరుగుతోన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నిక రేసులోకి మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌  దిగారా, అధ్యక్ష ఎన్నికలో దిగ్విజయ్‌ బరిలోకి దిగడం ఖాయమని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియకు రేపే చివరి రోజు కావడంతో ఏకే అంటోనీతో సోనియా గాంధీ సమావేశయ్యారు. అధ్యక్ష ఎన్నికల బరిలోకి దింపాల్సిన అభ్యర్థి పై గంటన్నరకు పైగా చర్చించారు. ఇక ఇవాళ అశోక్‌ గెహ్లాట్‌ సోనియాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానం పై ప్రదర్శించిన ధిక్కార వైఖరి పట్ల సోనియాకు గెహ్లాట్‌ ఫోన్‌లో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనక తన హస్తం లేదని ఆయన చెప్పినట్టు సమాచారం.

ఇటు దిగ్విజయ్‌ సింగ్‌ సాధ్యమైనంత త్వరగా ఢిల్లీకి చేరుకుంటారని, రేపే నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో పార్టీ నాయకత్వం ప్రమేయం లేదన్న ప్రచారం జరగుతోంది. దిగ్విజయ్‌ ప్రస్తుతం కేరళలో భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఇక ఇప్పటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ అధ్యక్ష బరిలో ఉండగా ఆయన కూడా రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సోనియాగాంధీ ఆదేశిస్తే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక బరిలో దిగేందుకు పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది.

Exit mobile version