Site icon Prime9

Karnataka Congress: చెవిలో పూలతో అసెంబ్లీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Karnataka congress

Karnataka congress

Karnataka Congress:కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెవిలో పూలతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఊహించని నిరసనతో భాజపా ప్రభుత్వానికి వింత నిరసన ఎదురైంది.

చెవిలో పూలతో కాంగ్రెస్ నేతలు.. (Karnataka Congress)

భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. అసెంబ్లీకి చెవిలో పూలు పెట్టుకొని వచ్చారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెవిలో పూలు పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు చెవిలో పూలతో అసెంబ్లీలో దర్శనమిచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో.. ఈ వినూత్న నిరసన ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

కర్ణాటకలో ఇదే చివరి బడ్జెట్..

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ బడ్జెట్ చివరిది కానుంది. సీఎం పదవితో పాటు.. ఆర్ధిక శాఖను కూడా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలోనే.. కాంగ్రెస్ నేతలు చెవిలో పూలతో దర్శనమిచ్చారు. ఈ బడ్జెట్ తీరును ఉద్దేశించి.. చెవిలో పూలు అంటూ కాంగ్రెస్ విమర్శలు చేసింది. గతేడాది.. ప్రవేశపెట్టిన బడ్జెట్ లో భాజపా ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శలకు దిగారు. అంకెల గారడీతో.. భాజపా ప్రభుత్వం కర్ణాటక ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. సీఎం బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య మధ్య మాటల యుద్ధం నడిచింది. గత బడ్జెట్‌లో ప్రకటించిన పనులను ఇప్పటి వరకు పూర్తి చేయలేదని.. సిద్దరామయ్యా అన్నారు. కేవలం చేపట్టిన పనుల్లో 10శాతం మాత్రమే పూర్తి చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారని.. తీవ్ర విమర్శలు చేశారు. సిద్దరామయ్య మాటలపై.. సీఎం బసవరాజ్ బొమ్మై.. ఘాటుగా స్పందించారు. సిద్దరామయ్య హయాంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ధీటుగా సమాధానం ఇచ్చారు. కర్ణాటక చరిత్రలోనే సిద్దరామయ్య గరిష్ఠంగా అప్పులు చేశారని ఎదురుదాడి చేశారు. 2023-24 ఏడాదికి తాము ప్రవేశపెట్టేది మిగులు బడ్జెట్‌ అని తెలిపారు. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Exit mobile version