Site icon Prime9

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో చర్చించే అంశాలు ఇవే!

CM Revanth Reddy in New Delhi to meet PM Modi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఈ మేరకు రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన.. ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు.

ప్రధానంగా బీసీ కులగణన రిజర్వేషన్లు, రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు నిధుల విషయంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మూసీ సుందరీకరణతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు అనుసంధానం, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, విభజన చట్టంలో ఉన్న వివిధ పెండింగ్ సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు.

దీంతో పాటు అచ్చంపేట సమీపంలో ఎస్ఎల్‌బీసీ ప్రమాద విషయాన్ని మోదీకి వివరించవచ్చు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పలువురు మంత్రులను సైతం కలిసే అవకాశం ఉంది. అదే విధంగా కాంగ్రెస్ అగ్ర నేతలను కలవడంతో పాటు రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీపై చర్చించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లడంతో ఎక్స్ వేదికగా దగాపడ్డ తెలంగాణ 36వ సారి అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది. రేవంత్‌ చేతిలో తెలంగాణ దగాపడ్డదని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. పాలన గాలికొదిలి ఢిల్లీకి వెళ్తున్నారని, కప్పం కడితేనే, పదవి ఉంటదని బీఆర్ఎస్ ఆరోపించింది. కాంగ్రెస్ అధిష్టానం మెప్పుపొందడానికి 36 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌కి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 72 గంటలు అవుతున్నా ప్రమాదంలో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్లే సమయం లేదని బీఆర్ఎస్ విమర్శించింది.

Exit mobile version
Skip to toolbar