Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్ మరోమారు రక్తమోడింది. తాజాగా మంగళవారం నాడు చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతాదళాలకు .. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా నక్సల్స్‌ఏరివేత కార్యక్రమంలో జిల్లా రిజర్వ్ గార్డ్‌లు, స్పెషల్ టాక్స్ ఫోర్స్‌లు పాల్గొన్నాయని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోందన్నారు.
నారాయణపూర్ -కాంకేర్ సరిహద్దులోని అబుజ్‌మాడ్ ఏరియాలో తెల్లవారుఝామునుంచే డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌కు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని…తమ అంచనా ప్రకారం ఏడుగురు మావోయిస్టులు మృతి చెందగా.. చాలా మంది గాయపడినట్లు తెలిసిందని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే భద్రతా దళ సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.ఈ నెల 5న చత్తీస్‌గఢ్ జిల్లాలోని దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సల్ చనిపోయాడు. కిరణ్‌దుల్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డిస్ర్టిక్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బస్తర్ ఫైట్స్, సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (సీఆర్‌ఎఫ్‌సీ)కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి చెందాడని యాంటీ నక్సల్ ఆపరేషన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా పోలీసులకు పురన్‌గల్, బాడేపల్లి, డోటిటుమ్మార్ గామ్‌పూర్ ఏరియాలో నక్సల్స్ సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సల్ మృతి చెందగా.. మరో వ్యక్తి శవం లభించింది. అయితే కాల్పుల జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.