Digvijay Singh: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్ గురించి సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ను పంచుకున్నారనే ఆరోపణలపై ఇండోర్ పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్రప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు చేసారు.స్థానిక న్యాయవాది, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేష్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది.
దళితులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలు మరియు హిందువుల మధ్య వివాదాన్ని సృష్టించడం ద్వారా ప్రజలను రెచ్చగొట్టేలా “గురూజీ”గా ప్రసిద్ధి చెందిన గోల్వాల్కర్ పేరు మరియు చిత్రంతో కూడిన వివాదాస్పద పోస్టర్‌ను సింగ్ ఫేస్‌బుక్‌లో పంచుకున్నారని జోషి తన ఫిర్యాదులో ఆరోపించారు. గోల్వాల్కర్‌పై సింగ్ చేసిన పోస్ట్ సంఘ్ కార్యకర్తలు మరియు మొత్తం హిందూ సమాజం యొక్క మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.
దళితులు, వెనుకబడినవారు మరియు ముస్లింలకు సమాన హక్కులు కల్పించడం కంటే బ్రిటిష్ పాలనలో జీవించడం తనకు ఇష్టమని గోల్వాల్కర్ చెప్పినట్లు దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేసారు. దీనిపై , సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మరియు దాని ప్రచార విభాగం అధిపతి సునీల్ అంబేకర్ మాట్లాడుతూ దిగ్విజయ్ సిం గ్ ఫోటోషాప్ చేయబడిన చిత్రాన్ని పోస్ట్ చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవి మరియు సామాజిక అసమ్మతిని కలిగించే ఉద్దేశ్యంతో ఉన్నాయని పేర్కొన్నారు. తానెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. సామాజిక వివక్ష నిర్మూలనకు గోల్వాల్కర్ జీవితం అంకితమైందని అంబేకర్ ఉద్ఘాటించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిపై ఈ విధంగా ట్వీట్ చేసారు.వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం మరియు ద్వేషాన్ని వ్యాప్తి చేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటు. గౌరవనీయమైన శ్రీ గోల్వాల్కర్ గురూజీ తన జీవితాంతం సామాజిక విభేదాలను తొలగించి, సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేశారు.గురూజీపై ఇలాంటి అసత్య ప్రచారాలు కాంగ్రెస్ నేతల నిరాశను తెలియజేస్తోందని, గురూజీపై తప్పుడు చిత్రాన్ని పెట్టి సామాజిక విద్వేషాలు సృష్టించే ప్రయత్నం ఖండనీయమని అన్నారు.