‘Captain’ Vijayakanth: కోలీవుడ్ లో విజయవంతమైన నటుడిగా నిరూపించుకున్న విజయకాంత్ సెప్టెంబర్ 2005లో డీఎండీకేని స్థాపించడం ద్వారా తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. తమిళనాట అప్పటికే సంస్దాగతంగా బలంగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) లకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నించారు.
విజయకాంత్ పార్టీ డీఎండీకే 2006 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో పార్టీ మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో విజయకాంత్ కడలూరు జిల్లాలోని వృద్ధాచలం నియోజకవర్గంలో 13,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. తన పార్టీ తరపున ఒక్కరే గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటికి పార్టీ పెట్టి కేవలం ఏడాది అయినప్పటికీ డీఎండీకే డీఎంకే మరియు ఏఐఏడీఎంకే రెండింటి ఓట్లను చీల్చి సుమారుగా 8% ఓట్లను పొందింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు గెలవనప్పటికీ డీఎండీకే 10% ఓట్లను సాధించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ అన్నాడీఎంకేతో జతకట్టారు.ఈ ఎన్నికల్లో డీఎండీకే 29 సీట్లను గెలుచుకుని తమిళనాట రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయకాంత్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేతగా మారారు.అయితే తరువాత విజయకాంత్, జయలలిత ల మధ్య విబేధాలు ఏర్పడి ఆయన అన్నాడీఎంకే కూటమినుంచి వైదొలిగారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పీఎంకే, ఎండీఎంకే, వీసీకేలతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగినా ఒక్క సీటు కూడా దక్కలేదు.
2016 అసెంబ్లీ ఎన్నికలముందు డీఎండీకే కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే లో చేరిపోయారు. తరువాత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్వంతంగా బరిలోకి దిగిన డీఎండీకే ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. విజయకాంత్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటినుంచి డీఎండీకే ప్రభ మసకబారింది. విజయకాంత్ ఛరిష్మా తగ్గుముఖం పట్టం, ఆయన ఆరోగ్యం క్షీణించడం, పార్టీపైన ఆయన బావమరిది, భార్య పెత్తనం, అభిమాన సంఘాలు దూరం జరగడంతో డీఎండీకే తరువాత ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. అయితే తమిళనాట రాజకీయ పార్టీని పెట్టి పదేళ్లపాటు విజయకాంత్ రెండు ద్రవిడ పార్టీలకు ధీటుగా తలపడటం మాత్రం విశేషంగానే పేర్కొనాలి.