Nasal Vaccine: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం మొదలయ్యింది. బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీనితో మరో కొత్తరకం వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు చాలా మందికి పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బూస్టర్ డోస్ గా నాసల్ వ్యాక్సిన్ తీసుకోమంటున్నారు. మరి గతంలో బూస్టర్ తీసుకున్నవారు ఇప్పుడు దీన్ని వేయించుకోవచ్చా లేదా అనే సందేహం ఉంది. ఈ తరుణంలోనే కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్, దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ హెడ్ ఎన్ కే అరోరా కీలక హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో బూస్టర్ డోస్ తీసుకోని వాళ్లకు మాత్రమే ఈ ముక్కు ద్వారా తీసుకునే టీకాను ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రికాషన్ డోస్ తీసుకున్న వారికి ఈ నాసిల్ వ్యాక్సిన్ ఇవ్వకూడదని అన్నారు. కొవి షీల్డ్, కోవాగ్జిన్, బూస్టర్ డోసు ఇలా మూడు వ్యాక్సిన్ డోసులను తీసుకున్న వారు నాలుగో డోసు కింది ఈ వ్యాక్సిన్ ను తీసుకోవడానికి అనుమతించమని ఆయన వెల్లడించారు. కొవి షీల్డ్, కోవాగ్జిన్ తీసుకుని బూస్టర్ డోస్ తీసుకోని వారికి మాత్రమే నాసిల్ వ్యాక్సిన్ ను బూస్టర్ డోస్ గా రికమెండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఎవరైనా ఒక వ్యక్తి పదేపదే యాంటిజెన్ వంటి వ్యాక్సిన్ తీసుకుంటే కొంత కాలం తర్వాత ఆ వ్యక్తి శరీరం సరిగ్గా స్పందించడం ఆగిపోతుందని డాక్టర్ అరోరా చెప్పారు.
ఒకవేళ స్పందించినా ఆ రియాక్షన్ చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. అందువల్లే తొలుత రెండో డోసు వేసుకోవడానికి 6 నెలల గ్యాప్ పెట్టామని తెలిపారు. కానీ జనాలు 3 నెలల గ్యాప్ తో వ్యాక్సిన్ వేయించుకున్నారని దీనివల్ల అనుకున్నంత ఫలితం రాలేదని చెప్పారు. ఈ కారణంగానే 4వ డోసు వద్దని చెపుతున్నామని వెల్లడించారు.
18 ఏళ్లు పైబడిన వారందరూ నాసిల్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డాక్టర్ అరోరా తెలిపారు. రెండు ముక్కు రంద్రాల్లో నాలుగు చుక్కల చొప్పున వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందన్నారు. 0.5 ఎం.ఎల్. వ్యాక్సిన్ ను వేస్తారని తెలిపారు. ఇది చాలా సేఫ్ వ్యాక్సిన్ అని.. కొందరికి కొంత సేపు ముక్కు రంద్రాలు బ్లాక్ అయ్యే చిన్నపాటి అవకాశం మాత్రమే ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: బయోటెక్ నాసికా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా?