CM Siddaramaiah: కేంద్రం నుంచి కరువు నిధులు అడిగేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య , రాష్ట్ర మంత్రి జమీర్ అమ్మద్ ఖాన్ ‘ప్రైవేట్ జెట్’లో ఢిల్లీ వెళ్లడం ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మధ్య ఆసక్తికరమైన మాటల యుద్ధానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ షేర్ చేస్తూ.. విమర్శలు గుప్పించగా, మీరు మాత్రం చేస్తున్నదేమిటంటూ కాంగ్రెస్ ఎదురు ప్రశ్నించింది.
కేంద్రం నుంచి కరవు నిధులు అడిగేందుకు సిద్ధరామయ్యతో కలిసి ‘ప్రైవేట్ జెట్’లో ఢిల్లీ వచ్చిన విషయాన్ని స్వయంగా అహ్మద్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఇదే వీడియోను అమిత్ మాలవీయ షేర్ చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ యూనిట్‌పై వ్యంగ్యోక్తులు గుప్పించారు. ఒకవైపు కాంగ్రెస్ ‘క్రౌడ్ పుల్లింగ్’ పేరుతో విరాళాలు వసూలు చేస్తూ, ఇండియా అలయెన్స్ మీటింగ్‌లో సమోసాలు కూడా సర్వ్ చేయలేని పరిస్థితిలో ఉందని చెబుతోందని, మరోవైపు హ్యాపీ మూమెంట్స్ పేరుతో సీఎం సిద్ధరామయ్య ప్రైవేట్ జెట్‌లో హ్యాపీ మూమెంట్స్ పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో పాలన గాడితప్పిందని, కాంగ్రెస్ లూటీ కొనసాగుతోందని విమర్శించారు.
నరేంద్ర మోదీ సంగతేమిటి?..(CM Siddaramaiah)
‘లగ్జరీ జెట్’ అంటూ బీజేపీ చేసిన కామెంట్లను సీఎం సిద్ధరామయ్య తిప్పకొట్టారు. ”నరేంద్ర మోదీ ఎలా ప్రయాణిస్తారు? మొదట ఆ మాట చెప్పండి. నరేంద్ర మోదీ ఏ విమానంలో ప్రయాణిస్తారో బీజేపీ వాళ్లను ముందు కనుక్కోండి. ఆయన ఒంటరిగా ప్రయాణిస్తుంటారు. అలా ఎందుకు ప్రయాణిస్తారు? బీజేపీ వాళ్లు మాట్లాడేవన్నీ చాలా సిల్లీగా ఉంటాయి” అని సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి తన సొంత కారణాలతో ప్రత్యేక విమానంలో వెళ్లలేదని, సమయం ఆదా చేయడానికి అందులో ప్రయాణించారని సమర్థించారు. ఫ్లైట్ టిక్కెట్లు అందుబాటులో లేనప్పుడు ప్రైవేటు విమానాల్లో వెళ్తుంటామని, పార్టీ ప్రతినిధి బృందాన్ని దిల్లీకి తీసుకువెళ్లడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని డీకె చెప్పుకొచ్చారు…