Brij Bhushan Sharan Singh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. మహిళా రెస్లర్లను లైంగికంగా వేధించాడని ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో క్రీడాకారులంతా ఆయనను అరెస్టు చేయాలని, ఆయన చేతిలో తాము లైంగిక వేధింపులకు గురయ్యామని ప్రధాని నుంచి హోంమంత్రి వరకు ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేశారు. అయినా వారు పెద్ద గా పట్టించుకోలేదు. అయితే తాజాగా బీజేపీ గురువారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఖైసర్‌గంజ్ నుంచి వరుసగా ఆరు సార్లు పోటీ చేసిన గెలిచిన బ్రిజ్ భూషణ్‌కు ఈసారి బీజేపీ అధిష్టాన మొండిచెయ్యి చూపింది. ఆయన స్థానంలో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు లోకసభ టిక్కెట్ ఇచ్చిపోటీకి నిలబెట్టింది. కాగా బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలు లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన రాయబరేలీ నుంచి ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ నామినేషన్ ఫైల్ చేశారు.
బ్రిజ్ భూషణ్ కొడుక్కి టికెట్.. (Brij Bhushan Sharan Singh)
ఇక బ్రిజ్ భూషణ్ సింగ్ విషయానికి వస్తే ఆయన గత 12 సంవత్సరాల నుంచి రెస్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా కొనసాగుతున్నారు మహిళా క్రీడాకారులను వేధింపులకు గురిచేశాడన్న కారణంగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద క్రీడాకారిణులు సుమారు 38 రోజుల పాటు దీక్షలు చేపట్టి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఆయనపై ఐపీసీలోని పలు సెక్షన్లను నమోదు చేసింది. దీంతో బీజేపీ అధిష్టానం బ్రిజ్ భూషణ్‌కు బదులుగా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సివచ్చింది. ఇక దినేష్ ప్రతాప్‌సింగ్ విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో మారారు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన అమెథీ, రాయబరేలి నుంచి గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇప్పటికి స్పష్టత లేదు. కాగా శుక్రవారం నాడు ఈ రెండు సీట్లకు నామినేషన్ వేయడానికి చివరి తేదీ. అయితే రాయబరేలి నుంచి దినేష్ ప్రతాప్‌సింగ్‌ను బీజేపీ బరిలో నిలిపింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ అమెధీ, రాయబరేలీ సీటు గురించి ప్రస్తావిస్తూ.. ఈ సీట్ల నుంచి పోటీ చేయాలా వద్దా అనేది రాహుల్, ప్రియాంకాల నిర్ణయానికే వదిలేశామని గురువారం చెప్పారు. అయితే కాంగ్రెస్ వ్యూహకర్తలు మాత్రం అమెధీ నుంచి ప్రియాంకా గాంధీతో నామినేషన్ వేయించాలనే ఆలోచనలో ఉన్నారు.రాయబరేలీ నుంచి రాహుల్‌గాంధీని నిలపాలని సూచిస్తున్నారు. రాయబరేలీకి ప్రాతినిధ్యం వహించిన సోనియా ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాహుల్, ప్రియాంకాలు అమెధీ, రాయబరేలీ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. బదులు కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారన్న వార్తలు రాజధానిలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఇటు అమెధీ, రాయబరేలీ లోకసభ నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరుగనుంది. అమెధీ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీని బీజేపీ మరోమారు పోటీకి నిలిపింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆమె రాహుల్‌ను 55వేల ఓట్లతో ఓడించారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ నుంచి సోనియా గాంధీ గెలుపొందారు. మరి ఈ రెండు సీట్లనుంచి రాహుల్, ప్రియాంకాలు పోటీ చేస్తారా లేదా అనే సస్పెన్స్ శుక్రవారంతో ముగుస్తుంది.