Biporjoy Cyclone: ‘బిపోర్ జాయ్’ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు.. రుతుపవనాలు మరింత ఆలస్యం

Biporjoy Cyclone: నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేశారు. దీనికి కారణం ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్ జాయ్’ తుపాను. ఈ తుపాన్ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. దీనివల్ల రుతుపవనాల రాకకు మరో 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

‘నైరుతి రుతుపవనాల రావడం ఇప్పటికే 6 రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను కారణంగా.. ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడానికి మరో 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశముంది’అని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్‌ అంచనాకు వచ్చింది. గత ఏడాది జూన్‌ 1 వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది జూన్ 1 కి రుతుపవనాలు కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణంలోని మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రావడం మరింత ఆలస్యం అవుతోంది. ముందుగా జూన్‌ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేశారు. కానీ, 7 వ తేదీ వచ్చినా కూడా రుతుపవనాల ఆచూకీ కన్పించడం లేదు. మరోవైపు తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నాయిన వాతావరణ నిపుణులు వెల్లడించారు. రుతుపవనాల ఆలస్యం అవ్వడం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వానాకాలంలో 5 శాతం వరకూ వర్షపాతం తగ్గొచ్చని అంచానా వేస్తున్నారు.

 

అతి వేగంగా బలపడుతోన్న తుపాను(Biporjoy Cyclone)

మరో వైపు, అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను అతి వేగంగా బలపడుతోంది. తీవ్ర తుపానుగా మారిన బిపోర్‌జాయ్‌.. బుధవారం ఉదయం గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ దిశగా- నైరుతి ప్రాంతంలో, ముంబైకి 1,000 కిలోమీటర్ల దూరంలో నైరుతిలో, పోర్‌ బందర్‌కు 1,070 కిలోమీటర్ల దూరంలో దక్షిణ వైపు, కరాచీకి 1,370 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన తుపాన్ గా కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తర- వాయువ్య దిశలో కదిలే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ తుపాను కారణంగా అరేబియా తీర ప్రాంతాలకు ఎటువంటి ముప్పు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, ముందు జాగ్రత్త కోసం తీర ప్రాంత ప్రజలు అప్రమత్తం ఉండాలని సూచించారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

 

ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బిపోర్ జాయ్ తుపాను కారణంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షపాత హెచ్చరికను జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు కూడా కొన్ని రోజుల పాటు వర్షాలు ఉన్నట్టు తెలపింది. అదే విధంగా కర్నాటక, మహారాష్ట్ర, కేరళ లలో భారీ వేగంతో ఈదురుగాలులు సంభవిస్తాయని తెలపింది.