Bihar MLA Neetu Singh: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో పెద్ద సీన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ మహిళా ఎంపీలు దీనిపై లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రాహుల్‌గాంధీకి బీహార్ ఎమ్మెల్యే నీతూ సింగ్ అండగా నిలిచారు.
నీతూ సింగ్ స్మృతి ఇరానీపై తీవ్రవ్యాఖ్యలు చేసి కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. స్మృతి ఇరానీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌పై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ‘ మా నాయకుడు రాహుల్ గాంధీ తలచుకుంటే అందమైన అమ్మాయిలు క్యూ కడతారు. 50 ఏళ్ల ముసలామెను చూసి ఫ్లయింగ్ కిస్ ఇవ్వాల్సిన ఖర్మ రాహుల్ కు ఎందుకుంటుంది. స్మృతి ఇరానీ పెద్ద అందెగత్త … ఆమెను చూసి రాహుల్ కిస్ ఇవ్వడానికి అంటూ స్మృతిపై చురకలంటించారు. రాహుల్‌పై స్మృతి చేసిన ఆరోపణలంతా అవాస్తవాలన్ని నీతూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్ అయ్యింది.
గత బుధవారం నాడు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొని ప్రసంగించిన తర్వాత సభ నుంచి నిష్ర్కమిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో సభలో స్మృతి ఇరానీ ప్రసంగిస్తున్నారు. రాహుల్ తనను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆమె భావించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్త్రీ ద్వేషం ఉన్నవారు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఆమె రాహుల్‌పై శాపనార్థాలు లంకించుకున్నారు. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే స్మృతి ఇరానీపై చేసిన విమర్శలను బీజేపీ కూడా తిప్పకొట్టింది. నీతూ సింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అని వ్యాఖ్యానించారు. కాబట్టి రాహుల్‌ను వెనకేసుకు రావడానికి వారు ఎంత దూరమైనా పోతారని పూనావాలా అన్నారు.
అసలు విషయానికి వస్తే రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానం డిబెట్‌లో పాల్గొని సభ నుంచి నిష్ర్కమిస్తుండగా.. ట్రెజరీ బెంచీల్లో ఉన్న సభ్యులు ఆయనను చూసి గట్టిగా హేళనగా అరవడం మొదలుపెట్టారు. దీంతో రాహుల్ వెనుదిరిగి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీనికి స్మృతి ఇరానీ తనను చూసి రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని రాద్దాంతం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.