Site icon Prime9

Bengaluru: ‘మా ముఖ్యమంత్రి ఆయనే..’ కర్ణాటకలో ప్లెక్సీల వార్

Bengaluru

Bengaluru

Bengaluru: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దాని పై చర్చ నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ లో అత్యంత ముఖ్యలైన పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్యల వర్గీయుల మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇరువురి పక్షాల మధ్య ఫ్లెక్సీల వార్‌ నెలకొంది. ఆదివారం ఉదయం బెంగళూరులో ఇరువురి నాయకుల అభిమానులు పలు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ అభిమాన నాయకుడే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆంకాక్షించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇరువర్గాలు కలిసి నడిచి పార్టీకి విజయాన్ని అందించాయి. కానీ, ఫలితాలు వచ్చిన తర్వాత తమ నాయకుడికి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. కాగా, శనివారం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర మాట్లాడుతూ తన తండ్రి సీఎం పోస్టుకు అర్హుడని పేర్కొన్నారు. మరోవైపు డీకే శివకుమార్‌ సోదరుడు సురేష్‌ మాట్లాడుతూ తన సోదరుడిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం సంతోషం వ్యక్తం చేస్తుందని వ్యాఖ్యానించారు.

 

 

నేడు సీఎల్పీ భేటీ(Bengaluru)

మరో వైపు ఆదివారం సాయంత్రం సీఎల్‌పీ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఇందుకోసం కొత్తగా ఎన్నికైన వారంతా ఈ రోజు సాయంత్రానికి బెంగళూరు చేరుకోవాలని పార్టీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ భేటీ కోసం ఏఐసీసీ పరిశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానం నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అనంతరం సీఎం అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది. దీంతో సీఎం ఎవరు అనేదానిపై అదిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని ఉత్కంఠ నెలకొంది.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియంక్ ఖర్గే ఈ విషయంపై స్పందించారు. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని సీఎం గా ఎంపిక చేయరన్నారు. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని సీఎం ఎవరనేది అదిష్టానం ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు.

 

Exit mobile version