Bengal Panchayat Election Result: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ మొదలు పోలింగ్ రోజు, నేడు ఓట్ల లెక్కింపు వరకు రోజురోజుకు అక్కడి పరిస్థితులు మరింత హింసాత్మకంగా తయారవుతున్నాయి. నేడు మంగళవారం ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది. అయితే, పోలింగ్ రోజున చోటుచేసుకున్న ఘర్షణలను దృష్ట్యా.. కౌంటింగ్‌కు కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశాయి. అయినప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. డైమండ్ హార్బర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంపైకి దుండగులు బాంబులు విసిరారు. కానీ ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అక్కడి పోలీసులు తెలిపారు. ఇకపోతే పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 339 కేంద్రాల వద్ద కౌంటింగ్ కొనసాగుతోంది. 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులే ఆధిపత్యం కొనసాగుతున్నారు. గ్రామ పంచాయతీలతోపాటు పంచాయతీ సమితి, జిల్లాపరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది.
టీఎంసీ హవా(Bengal Panchayat Election Result)
పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన కౌంటింగ్ ఫలితాలను పరిశీలిస్తే 2,546 పంచాయతీల్లో టీఎంసీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 21 గ్రామ పంచాయతీల్లో ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ మేధినీపూర్ గ్రామ పంచాయతీలో 26 స్థానాల్లో, నాడియా గ్రామ పంచాయతీలోనూ 73 స్థానాల్లో, బంకురా గ్రామ పంచాయతీలోనూ 37 సీట్లలో టీఎంసీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. కూచ్ బెహార్ జిల్లా పరిషత్ స్థానంలోనూ టీఎంసీదే హవా కొనసాగుతోంది.
ఇకపోతే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మరో రెండు రోజులు పట్టే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సాయంత్రానికి ఫలితాల సరళిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. అయితే 2018లో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది.