Automatic Disqualification: పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడ్డ కాంగ్రెస్ నేత రాహుల్ నేత పై అనర్హత వేటు వేయడంపై దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ నేత అనర్హత వేటు విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళకు చెందిన సోషల్ యాక్టివిస్ట్, పీహెచ్ డీ స్కాలర్ ఆబా మురళీధరన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్8(3) ‘ ఆటోమేటిక్ అనర్హత’ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ ఈ పిల్ దాఖలు అయింది.
ఏకపక్షంగా సెక్షన్ 8(3)
ఎన్నికైన ప్రతిప్రతినిధుల నేరం రుజువైన వెంటనే అనర్హత వేటు వేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. పరువు నష్టం కేసులోని శిక్షలను చట్టం నుంచి మినహాయించాలని ఈ సందర్భంగా విన్నపించారు. ఆటోమెటిక్‌గా ప్రజాప్రతినిధుల్ని అనర్హులుగా ప్రకటించే సెక్షన్ 8 విషయంలో దిశానిర్దేశం చేయాలని మురళీధరన్ పిటిషన్‌లో కోరారు. ఈ సెక్షన్ అక్రమంగా, ఏకపక్షంగా ఉందని ఆరోపించారు.
వచ్చే వారం విచారణకు(Automatic Disqualification)
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3)ను న్యాయసమ్మతం లేకుండా రూపొందించారని, అది రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల భావ స్వేచ్ఛను హరిస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ ఓట్లతో నేతల్ని ఎన్నుకున్నారని, కానీ ఆ చట్టం వల్ల ఆ నేత తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని తన పిటిషన్‌లో తెలిపారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
రాహుల్ మీడియా సమావేశం
శుక్రవారం లోక్ సభలో అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. రాహుల్ గాంధీ తొలిసారిగా మీడియా ముందుకు రానున్నారు. శనివారం మధ్యాహ్నం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. దీంతో అనర్హత వేటుపై రాహుల్ ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. కాగా అనర్హత వేటు పై రాహుల్ శుక్రవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘నేను దేశ ప్రజల వాణిని వినిపించేందుకు పోరాడుతున్నాను. ఎంత మూల్యమైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా’అంటూ ట్వీట్ చేశారు.
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ‘దొంగలందరీ ఇంటి పేరు మోదీయో ఎందుకుంటుందో’ అని రాహుల్ వ్యాఖ్యానించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా నిర్ధారించింది. ఈ క్రమంలో రెండేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన నైపధ్యంలో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసి సంచలన నిర్ణయం తీసుకుంది.
తీర్పు వెలువడిన నాటి నుంచి (మార్చి 23వ తేదీ) నుంచే వేటు అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే, అపీలుకు వీలుగా శిక్ష అమలును నెల రోజుల పాటు నిలిపేస్తున్నట్టు సూరత్ కోర్టు పేర్కొంది. కానీ లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటల్లోపే ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం! శిక్షపై ఉన్నత న్యాయస్థానంలో స్టే లభించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్షా కాలం, అనంతరం మరో ఆరేళ్లు కలుపుకుని మొత్తం ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ అనర్హుడవుతారు.