Assam Floods: అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారీ వరదలకు సుమారు 15 జిల్లాల్లో 1.61 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పటి వరకు వరదలకు 26 మంది ప్రాణాలు కోల్పోయారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ (ఏఎస్‌డీఎంఏ) వెల్లడించింది. ఇదిలా ఉండగా హైలాకంది జిల్లాలో ఒక వ్యక్తి వరద నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఏఎస్‌డీఎంఏ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ర్టంలో ఇప్పటి వరకు వరదల కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
వరద నీటిలో 470 గ్రామాలు..(Assam Floods)
ఇక వరదల వల్ల కరీంగంజ్ జిల్లాలో పరిస్థితి మాత్రం తీవ్రంగా ఉంది. వరదల వల్ల సుమారు 1.52 లక్షల మందిపై ప్రభావం చూపించింది. వారిలో 41,711 మంది పిల్లలున్నారు. నీలంబజార్, ఆర్‌కె నగర్, కరీంగంజ్, బాదర్‌పూర్ రెవెన్యూలోని 225 గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వరదల బారిన పడిన సుమారు 22,464 మంది ప్రజలు రిలీఫ్ క్యాంప్‌లకు తరలించారు. అధికారులు జిల్లాలో పలు ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. ఏఎస్‌డీఎంఏ వరదలపై తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 28 రెవెన్యూ సర్కిల్స్‌లో 470 గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. రాష్ర్టంలోని 11 జిల్లాల్లో 1378.64 హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగాయి. ఈ ప్రళయానికి 93,895 జంతువులపై పడింది.
ఇదిలా ఉండగా ఈ నెల 15న ముఖ్యమంత్రి హిమాంత బిశ్వాస్ శర్మ జిల్లా అధికారులతో పాటు పోలీసులతో సమావేశం అయ్యారు. వరదల సమయంలో కాజిరంగ నేషనల్ పార్కులోఉండే జంతువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదల సమయంలో కాజిరంగ నేషనల్ పార్కులో మూడు బెటాలియన్‌ల కమాండోలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దీంతో పాటు జాతీయ రహదారులపై జంతువులు రోడ్డు దాటుతున్నప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగకుంగా చర్యలు తీసుకోవడంతో పాటు … వరదలను అడ్డుపెట్టుకొని వన్యప్రాణులు వేటగాళ్ల పాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ వరదల సీజన్‌లో సుమారు 600 మంది ఫారెస్ట్ సిబ్బందిని రంగంలోకి దించి వన్యప్రాణాలను కాపాడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వాస్ శర్మ.