HP Election 2022: పోటీలో ఉన్నవారంతా కోటీశ్వరులే, రాష్ట్రం మాత్రం అప్పుల్లో ఉంది.. ఎక్కడో తెలుసా?

హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు అందరూ సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుల భారీ నుండి కాపాడడం ఆ పార్టీ ప్రభుత్వానికి చుక్కలు కనపడతాయి

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు అందరూ సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుల భారీ నుండి కాపాడడం ఆ పార్టీ ప్రభుత్వానికి చుక్కలు కనపడతాయి. దాదాపుగా రూ. 64,904 కోట్ల రుణాల ఊబిలో హిమాచల్ ప్రదేశ్ ఉండడమే అందుకు కారణం. విశేషమేమంటే తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో 55శాతం మంది కోటీశ్వరులే ఉండడం గమనార్హం.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో 90 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వారిలో 82 శాతం మంది కోటీశ్వరులు. మొత్తంగా 61 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 56 మంది బీజేపీ అభ్యర్థులు కోట్లకు పడగలెత్తారు.

బీజేపీ నుంచి సిమ్లాలోని ఛోపల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బల్వీర్ సింగ్ వర్మ రూ.128 కోట్ల ఆస్తులతో కుబేరుల స్థానంలో అగ్రస్థానంలో ఉన్నారు. సిమ్లా రూరల్ సీటు నుంచి పోటీచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ రూ.101 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. నగ్రోటా సీటుకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ దివంగత నేత జి.ఎస్.బాలి తనయుడు ఆర్ఎస్.బాలి రూ.96.33 కోట్లతో మూడు స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గాను 412 అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వీరిలో 55 శాతం మంది అంటే 226 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. ఆమ్ అద్మీ పార్టీ 67 మందిని బరిలో దింపగా, వారిలో కోటీశ్వరులు 35 మంది ఉన్నారు. బీఎస్‌పీ 53 స్థానాల్లో పోటీ చేస్తుండగా 13 మంది కోటీశ్వరులున్నారు. సీపీఎం నుంచి నలుగురు కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో సైతం 45 మంది కోటీశ్వరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Karnataka: అధికారులు వేధిస్తున్నారు, చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. రాష్ట్రపతికి దంపతులు లేఖ