Ajit Pawar: ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు..ఎలా మారుతాయే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొద్దిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరుతారంటూ వార్తలు వైరల్ గా మారాయి. అయితే అజిత్ పవార్ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోయని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేత్రుత్వంలోని శివసేన వర్గం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం షిండే శివసేన వర్గం , బీజేపీ కలిసి అధికారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షిండే వర్గం మాత్రం అజిత్ పవార్ టీమ్ ను దూరం పెట్టాలని బీజేపీ అధిష్టానికి ఒక సిగ్నల్ ను పంపింది. అయితే, ఈ క్రమంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పొలిటికల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే టెన్షన్ నెలకొంది. దీంతో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మహారాష్ట్ర సీఎం పదవి గురించి ఓ మీడియా వద్ద ఆయన చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనం.
అది ఢిల్లీ నిర్ణయం( Ajit Pawar)
ముఖ్యమంత్రి కావాలని మీరు అనుకుంటున్నారా ? అని అజిత్ పవార్ ప్రశ్నించగా..‘నూటికి నూరు శాతం అనుకుంటున్నా’ అంటూ ఆయన వెంటనే సమాధానం ఇచ్చారు. గత 20 ఏళ్లలో ఎన్సీపీ ఉపముఖ్యమంత్రి పదవికే పరిమితం కావడంపై అడగ్గా.. ‘2004లో ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. మేం 71 సీట్లు గెలవగా.. కాంగ్రెస్‌కు 69 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌తో సహా అందరై ఎన్సీపీకే సీఎం పదవి అనుకున్నారు. కానీ ఈ పోస్టుల విషయంపై ఢిల్లీ లో నిర్ణయం తీసుకున్నారు. హస్తం పార్టీకి సీఎం, ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి అని సందేశం వచ్చింది. మా పార్టీ నేత ఆర్‌ఆర్ పాటిల్‌ను శాసనసభాపక్ష నేతగా ఎంచుకున్నాం. కానీ ఎన్సీపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే.. ఆయనే సీఎం అయ్యేవారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రావడంతో ఆటోమేటిక్‌గా ఆ పార్టీకే సీఎం పదవి దక్కింది’ అని అజిత్ పవార్ సమాధానమిచ్చారు.
మేం ఇప్పుడు కూడా సిద్ధమే..
అదే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుందా? అని ప్రశ్నించగా.. ‘2024 వరకు ఎందుకు? మేం ఇప్పుడు కూడా ఆ పదవి పొందేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన సమాధానం ఇచ్చారు. అది ఎలా..? ఏంటి..? అనే విషయాన్ని మాత్రం అజిత్ పవార్ వివరించలేదు. కాగా బీజేపీలో చేరే వార్తలను ఎన్పీపీ అధినేత శరద్ పవార్, అజిత్ తోసిపుచ్చినా.. తాజాగా ఆయన పార్టీ సమావేశానికి హాజరుకాలేదు . దీంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది.