Site icon Prime9

Ajit Pawar: ఎన్సీపీకి అజిత్ పవార్ షాక్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం

Ajit Pawar

Ajit Pawar

Ajit Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పదవిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అజిత్‌ పవార్‌తో పాటు ఛగన్‌ భుజ్‌బల్‌, ధనంజయ్‌ ముండే, దిలీప్‌ వాల్సే పాటిల్‌ సహా మొత్తం తొమ్మిది మంది ఎన్‌సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్.. (Ajit Pawar)

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలగాలని ఉందని అజిత్ పవార్ తన కోరికను వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరగడం విశేషం. మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 30 మంది అజిత్ పవార్‌తో ఉన్నారని తెలుస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల నుంచి తప్పించుకోవడానికి ఆయనకు 36 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు అవసరం.అంతకుముందు ముంబైలోని తన అధికారిక నివాసంలో అజిత్ పవార్ కొందరు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.శరద్ పవార్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసి, మూడు రోజుల తర్వాత దానిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్న ఒక నెల తర్వాత వచ్చిన పార్టీపై అజిత్ పవార్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు.

ఆదివారం ముంబైలోని తన అధికారిక నివాసంలో ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ సమావేశం కావడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ సమావేశం గురించి తనకు తెలియదని, అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అతనికి ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించే హక్కు ఉందని తెలిపారు. ప్రస్తుతం పూణేలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీపై అజిత్ పవార్ తిరుగుబాటుకు ముందు ఈ ప్రకటన చేశారు. మరి అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేలతో పార్టీని వీడి ఏకంగా డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టడంపై శరద్ పవార్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. మొత్తంమీద ఈ పరిణామం ఒక్క ఎన్సీపీ కే కాకుండా ఉద్దవ్ ధాకరే వర్గానికి కూడా షాక్ అని చెప్పవచ్చు.

Exit mobile version