Uttar Pradesh: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ పోలీసు అధికారుల బృందం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసాన్ని సందర్శించింది.
కీలక పత్రాల సేకరణ..(Uttar Pradesh)
10 మంది సభ్యులతో కూడిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం సింగ్ నివాసానికి చేరుకుంది. దర్యాప్తులో భాగంగా కొన్ని కీలకమైన పత్రాలను సేకరించింది. బ్రిజ్ భూషణ్ నివాసంలోని కుటుంబ సభ్యులు, గృహిణులు, బంధువులను కూడా విచారించారు. సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి అకాడమీ కోచ్‌ల వాంగ్మూలాలను నమోదు చేసిన నందిని నగర్ మహావిద్యాలయ నేషనల్ అకాడమీలో కూడా పోలీసు బృందం విచారణ చేపట్టింది.
రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణల ఆధారంగా బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు మరియు 10 ఫిర్యాదులు దాఖలు చేశారు.. మొదటి ఎఫ్‌ఐఆర్‌లో ఆరుగురు ఒలింపియన్ల ఆరోపణలను ప్రస్తావించగా, రెండోది మైనర్ తండ్రి చేసిన ఆరోపణలను ప్రస్తావించింది. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ మరియు బజరంగ్ పునియా శనివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తాజాగా సోమవారం వీరు తమ రైల్వే ఉద్యోగాల్లో తిరిగి జాయిన్ అవుతున్నామని ఉద్యోగం చేస్తూనే నిరసన కొనసాగిస్తామని ప్రకటించారు.