Site icon Prime9

AIIMS Bhubaneswar: ఎయిమ్స్ భువనేశ్వర్ లో అరుదైన ఆపరేషన్.. వైద్యులను అభినందించిన ప్రధాని మోదీ

AIIMS Bhubaneswar

AIIMS Bhubaneswar

AIIMS Bhubaneswar:ఎయిమ్స్ భువనేశ్వర్ ఆదివారం కేంద్రపార జిల్లాకు చెందిన ఒక మహిళకు విజయవంతంగా నాలుగుసార్లు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపింది. వైద్యులు ఒకేసారి  తుంటి మరియు మోకాలి కీళ్లకు శస్త్రచికిత్స చేశారు.

ఒకేసారి నాలుగు జాయింట్ రీప్లేస్‌మెంట్‌లు.. (AIIMS Bhubaneswar)

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న మహిళ ఎయిమ్స్ భువనేశ్వర్ లో చేరింది. తుంటి మరియు మోకాళ్లలో తీవ్రమైన కీళ్లనొప్పుల కారణంగా ఆమె వికలాంగురాలు అయింది.రోగి వాకింగ్ ఎయిడ్స్ సహాయంతో మరియు విపరీతమైన కష్టంతో నడిచేవారు. తుంటి కీళ్లలో కదలికలు లేవు మరియు ఆమెకు రెండు మోకాళ్లలో కదలికలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆమెకు నాలుగు కీళ్లకు ప్రత్యామ్నాయ శస్త్రచికిత్సలు అవసరమయ్యాయని సీనియర్ డాక్టర్ చెప్పారు. పేషెంట్ ను  వైద్యుల బృందం పరిశీలించింది. తుంటి మరియు మోకాలి కీలు రెండింటిపై శస్త్రచికిత్సలు ఒకే సెట్టింగ్‌లో ప్లాన్ చేయబడ్డాయి.

ఒకే సెట్టింగ్‌లో నాలుగు జాయింట్ రీప్లేస్‌మెంట్‌లు రోగికి మరియు సర్జన్‌కు అనేక సవాళ్లను కలిగిస్తాయని డాక్టర్ చెప్పారు. శస్త్రచికిత్స సమయంలో రోగికి రక్తస్రావం మరియు శస్త్రచికిత్స ఒత్తిడిని అంచనా వేయబడింది. మొదట తుంటిని తరువాత మోకాళ్ల రీప్లేస్ మెంట్ జరిగింది. శస్త్రచికిత్స మూడు గంటల్లో పూర్తయింది. పేషెంట్ ను రెండు రోజులు ఐసియులో ఉంచి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. శస్త్రచికిత్స తర్వాత, మూడవ రోజు, మహిళ నడవడం ప్రారంభించింది.ఖచ్చితమైన టీమ్ మేనేజ్‌మెంట్, చిన్న వయస్సు కావడంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.

ప్రపంచంలోనే రెండవ ఆపరేషన్..(AIIMS Bhubaneswar)

ఈ తరహా ఆపరేషన్ నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా రెండవ సారి కావడం విశేషం. ఒడిశాలో మొత్తం నాలుగు జాయింట్‌లను ఒకే సెట్టింగ్‌లో మార్చడం ఇదే మొదటిది.
డాక్టర్ సుజిత్ కుమార్ త్రిపాఠి మరియు డాక్టర్ మంతు జైన్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్‌లుగా ఉన్నారు.అనస్థీషియా బృందానికి డాక్టర్ శ్రీతమ్ స్వరూప్ జెనా నాయకత్వం వహించారు.
ఎయిమ్స్ భువనేశ్వర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అశుతోష్ బిస్వాస్ మాట్లాడుతూ ఇలాంటి శస్త్రచికిత్సలు చాలా అరుదని చెప్పారు.

వైద్యులకు ప్రధాని మోదీ అభినందనలు..

అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసినందుకు ఎయిమ్స్ భువనేశ్వర్ వైద్యులను ప్రధాని మోదీ అభినందించారు.వైద్య ప్రపంచంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టి, ఆవిష్కరణలలో ఎల్లప్పుడూ ముందున్నందుకు మా వైద్యులకు అభినందనలు. వారి నైపుణ్యం మాకు గర్వకారణం! అంటూ మోదీ ట్వీట్ చేసారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య కూడా శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య సంస్థను అభినందించారు.

ఇవి కూడా చదవండి:

Exit mobile version