Site icon Prime9

Train Fire: రైలులో సహ ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి.. ముగ్గురి మృతి.. తొమ్మిదిమందికి గాయాలు

Train Fire

Train Fire

Train Fire: కేరళలోని కోజికోడ్‌లో ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సహ-ప్రయాణికుడికి నిప్పంటించడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు చనిపోగామరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత కేరళలోని ఎలత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఒక ఏళ్ల చిన్నారి మరియు ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.నిందితుడిని రైల్వే పోలీసులు ఇంకా గుర్తించలేదు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సహ ప్రయాణీకుడిపై పెట్రోలు పోసి..(Train Fire)

ఆదివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో అలప్పుజ-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ నగరం దాటి కోరాపుజా రైల్వే వంతెన వద్దకు చేరుకోగానే, గుర్తుతెలియని వ్యక్తి సహ ప్రయాణికుడిపై పెట్రోల్‌గా భావించేద్రవాన్ని పోసి నిప్పంటించాడు. గాయపడిన వారిలో కొందరికి 50 శాతం కాలిన గాయాలయ్యాయి, అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మరొక రైల్వే పోలీసు అధికారి తెలిపారు.రైలు డి1 కంపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ఘటనలో కనీసం ఎనిమిది మందికి కాలిన గాయాలయ్యాయని వారు తెలిపారు.ట్రాక్‌పై దొరికిన మృతదేహాలకు ఎటువంటి కాలిన గాయాలు లేవని పోలీసులు తెలిపారు.సంఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తి తప్పించుకోగా, ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్ లాగడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంఘటన వెనుక ఉగ్రకోణం ? ..

కేసు దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తామని, నిందితుడిని త్వరలోనే గుర్తిస్తామని కేరళ పోలీసులు తెలిపారు.మాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి, శాస్త్రీయ దర్యాప్తు కొనసాగుతోందని కేరళ పోలీసు చీఫ్ డిజిపి అనిల్ కాంత్ అన్నారు.ఈ కేసులో ఏదైనా ఉగ్రవాదం లేదా తీవ్రవాద కోణం ఉందా అని అడిగినప్పుడు ఇది విచారణలో భాగమని  విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుందని చెప్పారు.పట్టాల నుంచి మరో బాటిల్‌ పెట్రోల్‌, రెండు మొబైల్‌ ఫోన్లు ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఈ కేసులో ఉగ్ర కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినదాని ప్రకారం కోరాపుజా నది వెంబడి ఉన్న వంతెనపై రైలు ఆగిన వెంటనే, ముప్పై ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి దాని నుండి దూకి తన కోసం వేచి ఉన్న బైక్‌పై పారిపోయాడు.సమీపంలోని ఓ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ నుంచి దుండగుడి దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన దాడిగా వారు అనుమానిస్తున్నారు.

 

Exit mobile version