Tamil Nadu Liquor Deaths: తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం సేవించి 34 మంది చనిపోయారని కల్‌కురిచి జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ గురువారం తెలిపారు. సుమారు 60 మంది ఆస్పత్రి పాలయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం మొత్తం 107 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో 18 మంది కల్‌కురిచి ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయారు. మిగిలిన వారు జిల్లాలోని ఇతర ఆస్పత్రుల్లో మృతి చెందారు. మరికొంతమందిని జవహర్‌లాల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చిలో బుధవారం రాత్రి చేర్పించారు.
జిల్లా అధికారులపై వేటు..(Tamil Nadu Liquor Deaths)
ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం బుధవారం నాడు సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రవణ్‌కుమార్ జతావాను బదిలీ చేసింది. ఇక జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సామేయి సింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా కలెక్టర్‌గా ఎంఎస్ ప్రశాంత్‌ను, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా రజత్ చతుర్వేదిని నియమించారు. ఇక ఏఐఏడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడ్పాడి కె పలనిస్వామి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో స్పందించారు. అక్రమ మద్యం సేవించి 34మంది చనిపోయారన్న వార్త విని తాను షాక్‌కు గురయ్యాయనని చెప్పారు. తమిళనాడు శాసనసభలో అక్రమ మద్యం తాగి చనిపోయిన వారికి ఏఐఏడికెంకె తరపున సంతాపం తెలుపుతామన్నారు.
డీఎంకెం ప్రభుత్వం రాష్ర్టంలో అక్రమ మద్యం వరదను అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని ఏఐఏడీఎంకె చీఫ్ ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెబుతామని పలనిస్వామి అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకుకోవాలని ఆకాంక్షించారు. అక్రమ మద్యం సేవించి మృతి చెందిన వారి కుటుంబాలను కలిసేందుకు తాను కల్‌కురిచి వెళ్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా అక్రమ మద్యం సేవించి పెద్ద సంఖ్యలో మృతి చెందడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మద్యాన్ని నివారించడంలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు. అక్రమ మద్యం తయారు చేసే వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అక్రమ మద్యం తయారు చేసే వారిని ఉక్కుపాదంతో అణిచి వేస్తామన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.