Jammu Kashmir: నిత్యం తుపాకుల శబ్దాలతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో అక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కాగా మంగళవారం నాడు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పులతో జమ్మూ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అనంత్‌నాగ్ జిల్లాలోని పోష్క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులు సామాన్య ప్రజలలో కలిసిపోయి తిరుగుతున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
అది గుర్తెరిగిన ఉగ్రమూకలు పోలీసులపై కాల్పులు జరిపాయి. దానితో సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్ కౌంటర్గా మారిందని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, వీరిరువురు నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం కలిగి ఉన్నారని ఆ అధికారి వివరించారు.
మృతి చెందిన ఇద్దరు టెర్రరిస్టులను డానిష్ భట్ అలియాస్ కోకబ్ దూరీ మరియు బషరత్ నబీగా గుర్తించారు. 9 ఏప్రిల్ 2021న ఓ సైనికుడైన సలీమ్‌ను మరియు 29 మే 2021న జబ్లిపోరాలో ఇద్దరు స్థానిక పౌరులను హతమార్చడంలో వీరిద్దరి పాత్ర ఉందని అదనపు కశ్మీర్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.