Liquor Deaths: బీహార్‌లోని మోతీహరిలోని తుర్కౌలియా పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం సేవించి కనీసం 14 మంది మరణించారు. అయితే మరణాలపై పరిపాలన యంత్రాంగం స్పందించలేదు. వీటికి అతిసారం కారణంగా పేర్కొంది.ఈ ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ఇది బాధాకరమైన ఘటన అని, దీనిపై పూర్తి సమాచారం అడిగినట్లు తెలిపారు.ఆరోగ్య శాఖ మరియు పోలీసు సీనియర్ అధికారులు మఠ్ లోహియార్ గ్రామానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
సుమోటాగా తీసుకున్న మానవహక్కుల కమీషన్..(Liquor Deaths)
గత ఏడాది 40 మంది ప్రాణాలను బలిగొన్న సరన్ జిల్లాలో జరిగిన హూచ్ దుర్ఘటనకు రాష్ట్రాన్ని జాతీయ మానవహక్కుల కమీషన్ తప్పుబట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీజేపీ ల మధ్య విమర్శలు రేగాయి. శుక్రవారం కత్తులు దూశాయి. నకిలీ మద్యం తాగడం వల్ల సంభవించిన మరణాలను సుమోటాగా తీసుకున్న మానవహక్కుల కమీషన్ మరణించిన వారి సంఖ్య 70 మందికి పైగా ఉందని నిర్ధారించింది.
మొబైల్ టవర్‌ను ఎత్తుకెళ్లారు..
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో దొంగలు మొత్తం మొబైల్ టవర్‌ను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రమజీవి నగర్ ప్రాంతంలో ఉన్న మనీషా కుమారి ఇంట్లో జీటీఏఎల్ కంపెనీకి చెందిన మొబైల్ టవర్‌ను అమర్చారు.కంపెనీ అధికారులు మనీషా కుమారి ఇంటికి చేరుకుని పరిశీలించగా మొబైల్ ఫోన్ టవర్ కనిపించలేదు. ఒక జనరేటర్ సెట్, షెల్టర్ మరియు స్టెబిలైజర్ కూడా స్థలంలో కనిపించలేదు.
కంపెనీ అధికారి షానవాజ్ అన్వర్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విచారణలో, కొంతమంది వ్యక్తులు జీటీఏఎల్ ఉద్యోగులమని చెప్పుకుంటూ, కొన్ని నెలల క్రితం వచ్చి, మొబైల్ టవర్ పనిచేయడం లేదని, అందుకే దానిని తొలగిస్తున్నామని చెప్పినట్లు మనీషా కుమారి పోలీసులకు చెప్పారు.వారు అన్ని పరికరాలను తీసివేసి, పికప్ వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారు. సామగ్రి విలువ రూ.4.5 లక్షలు ఉంటుందని అంచనా.బీహార్‌లో మొబైల్ టవర్ చోరీకి గురికావడం ఇది రెండోసారి. గతంలో కూడా ఇదే తరహాలో పాట్నాలోని సబ్జీ బాగ్ ప్రాంతంలో మొబైల్ టవర్ చోరీకి గురైంది.