Nanded Hospital Deaths: మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఇటీవల ఈ ఆసుపత్రిలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 31 మంది మృతిచెందడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత ఎనిమిది రోజుల్లో ఈ ఆసుపత్రిలో మరో 108 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లోనే 11 మంది రోగులు మృతి చెందగా వీరిలో ఓ పసికందు కూడా ఉండటం గమనార్హం.
మందుల కొరత లేదు..(Nanded Hospital Deaths)
ఈ నెల ప్రారంభంలోనే ఈ ఆసుపత్రిలో 24 గంటల్లో 24 మంది మరణించిన విషయం తెలిసిందే. వారిలో 12 మంది శిశువులున్నారు. అయితే.. ఔషధాల కొరత వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆసుప్రతిలో రోగులు మృతిచెందుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వీటిని ఆసుపత్రి యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. వారు అత్యంత విషమ పరిస్థితుల్లోనే తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపింది. వీరిలో కొందరు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.ఈ వరుస మరణాలపై తాజాగా ఆసుపత్రి డీన్ శ్యామ్ వాకోడే మరోసారి స్పందిస్తూ.. ఔషధాల కొరత ఆరోపణలను తోసిపుచ్చారు. మా హాస్పిటల్‌లో ఔషధ నిల్వలు సరిపడా ఉన్నాయి. మూడు నెలలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచామని, సిబ్బంది కూడా రోగులకు అన్నివేళలా చికిత్స అందిస్తున్నారని చెప్పారు. మందుల కొరత కారణంగా ఏ రోగీ ప్రాణాలు కోల్పోలేదన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే చనిపోతున్నారు. ఇక మరణించిన చిన్నారుల్లో కొంతమందికి పుట్టుకతో వచ్చిన ఆరోగ్య సమస్యలున్నాయని ఆయన వివరించారు.
నాందేడ్ ఆసుపత్రిలో నవజాత శిశువులు, రోగులు మృత్యువాత పడటం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అటు జాతీయ మానవహక్కుల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.