Sri Rama Navami: ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి క్షేత్రంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 9 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగనున్నాయి.నవమి ముందు రోజు నుంచి 11 రోజుల పాటు ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన తరువాత పౌర్ణమిరోజు రాత్రి స్వామివారి కల్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కోదండరామస్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, అర్చన స్నపనాదులు, విశేషాలంకరణలు, డోలోత్సవములు సాయంకాలం వాహనసేవలు, స్వామివారికి కళ్యాణోత్సవము, రథోత్సవము, పుష్పయాగము, ఏకాంతసేవ జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు పలుధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులెల్లరూ ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ కోదండరామస్వామివారి కృపాకటాక్షములను పొందాలని ఆలయ కమిటీ కోరింది.
ఏప్రిల్ 5న కళ్యాణం..( Sri Rama Navami)
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్, ఈవోలు అందజేశారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకూ శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది. దీనికి సీఎం జగన్‌ను టీటీడీ చైర్మన్, ఈవోలు కలిసి ఆహ్వానించారు.
అదేవిధంగా అన్ని ఆలయాలలో కల్యాణం మధ్యాహ్నం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం రాత్రి జరుగుతుంది.ఈ విధంగా పౌర్ణమి రోజు రాత్రి సమయంలో స్వామివారి కల్యాణం జరగటానికి కారణం ఉంది.విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగటి సమయంలో జరుగుతుంది.పగటి సమయంలో వారి వివాహం చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు విష్ణుమూర్తిని కోరగా అందుకు విష్ణుమూర్తి రామావతారంలో నీ కోరిక తీరుస్తానని వరమిస్తాడు.అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు నిండు పున్నమి వెన్నెల సాక్షిగా వివాహం జరిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి.ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వడ్డె కులానికి చెందిన సోదరులకు ఒకనాడు కలలో శ్రీరాముడు కనిపించి వారికి జ్ఞానోదయం కల్పించాడు.తర్వాత వారు స్వామి వారి గర్భగుడిని నిర్మించి భక్తిశ్రద్ధలతో పూజించే వారు.ఈ విధంగా ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని ప్రతీతి.
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ ఒంటిమిట్ట ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉత్సవాలకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.