Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వ్యక్తిగత జీవీతం ఎందరికో స్ఫూర్తిదాయకం. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సాధారణ, గొప్ప, ఉదారమైన వ్యక్తి, రోల్ మోడల్. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన వ్యాపార రంగంలో అనేక రికార్డులను నెలకొల్పాడు. దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్‌ను ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాడు. టాటాను అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చాడు. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. నానో కారు నుంచి జాగ్వార్ వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజల దృక్పథాన్ని మార్చాయి. ఈ కథనంలో ఆయన జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం.
రతన్ టాటా డిసెంబర్ 28, 1937న నావల్, సును టాటా దంపతులకు జన్మించారు. అతను 1962లో కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. దీని తర్వాత, అతను 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశాడు. తండ్రి నావల్ టాటా విజయవంతమైన పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌లో ముఖ్యమైన పాత్ర పోషించారు. రతన్ టాటా తల్లి సోనీ టాటా గృహిణి.
రతన్ టాటా 1962లో టాటా గ్రూప్‌లో టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు. అదే ఏడాదిలో టాటా ఇంజనీరింగ్, లోకోమోటివ్ కంపెనీ జంషెడ్‌పూర్ ప్లాంట్‌లో ఆరు నెలల శిక్షణ తీసుకున్నాడు. వివిధ కంపెనీల్లో పనిచేసిన తర్వాత 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1981లో టాటా గ్రూప్ ఇతర హోల్డింగ్ కంపెనీ అయిన టాటా ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్‌గా బాధ్యతల చేపట్టారు. అక్కడ దానిని గ్రూప్ స్ట్రాటజీ థింక్ ట్యాంక్‌గా మార్చడానికి హై-టెక్నాలజీ వ్యాపారాలలో కొత్త వెంచర్‌ల ప్రమోటర్‌గా మార్చడానికి బాధ్యత వహించాడు.
ఆయన 1991 నుండి డిసెంబర్ 28, 2012 న పదవీ విరమణ చేసే వరకు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ కాలంలో టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలిసర్వీసెస్‌తో సహా ప్రధాన టాటా కంపెనీలకు ఛైర్మన్‌గా ఉన్నారు. రతన్ టాటా భారతదేశంతో పాటు విదేశాలలో వివిధ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాడు. రతన్ టాటా మిత్సుబిషి కార్పొరేషన్, జేపీ మోర్గాన్ చేజ్, అంతర్జాతీయ సలహా బోర్డులో కూడా ఉన్నారు. ఆయన సర్ రతన్ టాటా ట్రస్ట్, అలైడ్ ట్రస్ట్‌లు, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ అనుబంధ ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ధర్మకర్తల బోర్డులలో కూడా పనిచేశారు.
రతన్ టాటా సాధించిన విజయాలు..
1. 1991-2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్‌గా పనిచేశారు.
2. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కొనుగోలు (2008).
3. కోరస్ కొనుగోలు (2007).
4. టాటా స్టీల్ ప్రపంచవ్యాప్త పరిధిని పెంచడం.
5. టాటా మోటార్స్ విజయం.
6. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రపంచవ్యాప్త పరిధిని విస్తరించడం.
7. టాటా గ్రూప్ ప్రపంచ బ్రాండ్ విలువలో పెరుగుదల.
రతన్ టాటా ప్రధాన అవార్డులు..
1. పద్మవిభూషణ్ (2008)
2. పద్మ భూషణ్ (2000)
3. గౌరవ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (2009)
4. ఇంటర్నేషనల్ హెరిటేజ్ ఫౌండేషన్ జీవితకాల సాఫల్య పురస్కారం (2012)
రతన్ టాటా తన దాతృత్వం, సామాజిక సేవా కార్యక్రమాల కోసం విస్తృతంగా పాడుపడ్డారు. ఆయన నాయకత్వంలో టాటా ట్రస్ట్, టాటా ఫౌండేషన్ ఎడ్యుకేషన్, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణల రంగాలలో ప్రధానంగా కృషి చేశాయి.
సమాజాభివృద్ధికి విద్య కీలకమని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల స్థాపనలో ఆయన తనవంతు కృషి చేశారు. అనేక స్కాలర్‌షిప్‌లను కూడా ప్రారంభించారు. వాటి ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. టాటా ట్రస్ట్‌లు అనేక ఆరోగ్య సేవలు, ఆసుపత్రులలో పెట్టుబడి పెట్టాయి. క్యాన్సర్ పరిశోధన, ఎయిడ్స్ చికిత్స, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో ఆయన విశేష కృషి చేశారు.
రతన్ టాటా ప్రేమ వ్యవహారం
రతన్ టాటా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. నాలుగు పెళ్లిళ్లు దగ్గరకు వచ్చినా, పలు కారణాల వల్ల కుదరలేదు. అతను లాస్ ఏంజిల్స్‌లో పనిచేస్తున్నప్పుడు ఓ యువతితో ప్రేమలో పడ్డారు. కానీ 1962 నాటి భారత్-చైనా యుద్ధం కారణంగా ఆమె తల్లిదండ్రులు యువతిని భారత్‌కు పంపడానికి అంగీకరించలేదు. ఆ తర్వాత రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు.
రతన్ టాటా ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అక్కడ ఆర్కిటెక్చర్‌లో పట్టా పొందారు. ఆ రోజుల్లోనే రతన్ టాటాకు విమానాలు నడపడంపై ఆసక్తి పెరిగింది. ఆ రోజుల్లోనే డబ్బులు చెల్లించి పైలట్ శిక్షణ ఇచ్చే కేంద్రాలు అమెరికాలో ప్రారంభమయ్యాయి. దీంతో తన అభిరుచిని నెరవేర్చుకోవడానికి ఒక సువర్ణావకాశం వచ్చిందని టాటా భావించారు. కానీ అప్పుడు ఆయన దగ్గర సరిపడా డబ్బు లేదు. పైలట్ ట్రైనింగ్ కోసం ఫీజు సంపాదించడానికి టాటా చాలా ఉద్యోగాలు చేశారు. ఈ సమయంలో టాటా కొంతకాలం రెస్టారెంట్‌లో డిష్‌వాషర్‌గా కూడా పనిచేశారు.
రతన్ టాటా తన దాతృత్వానికి కూడా ప్రసిద్ధి చెందారు. టాటా గ్రూప్, రతన్ టాటా నాయకత్వంలో భారతదేశంలోని గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయంలో 28 మిలియన్ల టాటా స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 2010లో టాటా గ్రూప్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఒక కార్యనిర్వాహక కేంద్రాన్ని నిర్మించడానికి 50 మిలియన్లను విరాళంగా ఇచ్చింది. దీనికి టాటా హాల్ అని పేరు పెట్టారు. 2014లో టాటా గ్రూప్ IIT-బాంబేకి రూ. 95 కోట్లు విరాళంగా ఇచ్చింది. పరిమిత వనరులతో ప్రజలు, కమ్యూనిటీల అవసరాలకు సరిపోయే డిజైన్, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అభివృద్ధి చేయడానికి టాటా సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ (TCTD)ని ఏర్పాటు చేసింది.