Harirama Jogaiah Analysis: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల పొత్తులపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన విశ్లేషణ చేస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం అర్థమవుతోందని జోగయ్య అన్నారు. బిజెపికి దగ్గరవడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, కానీ బిజెపి రాష్ట్ర నాయకత్వం మాత్రం చంద్రబాబుని కలుపుకుని ప్రయాణం చేయడానికి అంత సుముఖంగా లేని మాట వాస్తవమని జోగయ్య వివరించారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బిజెపి దిగివచ్చి తెలుగుదేశం- జనసేన కూటమితో చేతులు కలపడానికి అంగీకరించే అవకాశాలు లేకపోలేదని జోగయ్య అంచనా వేశారు. అయితే టిడిపికి సిఎం పదవి కట్టబెట్టడానికి బిజెపి అంగీకరిస్తుందో లేదో చూడాల్సి ఉందని జోగయ్య పేర్కొన్నారు.
అయితే మరోపక్క జనసేన- టిడిపి కలిసి పని చేయడానికి మరింత దగ్గరవుతున్న వాస్తవాన్ని రెండు పార్టీల నేతల చర్యలు, ప్రకటనలలో గమనిస్తున్నామని జోగయ్య గుర్తు చేశారు. సిఎం పదవి విషయంలో అంగీకారం కుదిరిందా లేదా అన్నది ఊహించుకోవాలే కానీ అధికారికంగా మాత్రం తేలలేదని జోగయ్య చెప్పారు. సిఎం పదవి కాకుండా అసెంబ్లీ సీట్ల పంపకంలోనే ఇంతవరకూ నిర్ణయాలు జరగలేదని జోగయ్య వెల్లడించారు. సిఎం పదవి చంద్రబాబుకి కట్టబెట్టినట్లు ఒక వార్త వచ్చినా దాని విషయంలో కూడా పూర్తి అంగీకారాలు కుదరలేదని జోగయ్య అన్నారు.
సిఎం పదవి, సీట్ల పంపకాలు ఎలా ఉంటే ఎన్నికలలో టిడిపి- జనసేన కూటమి వైఎస్ఆర్‌సిపి ఓడించగలుగుతారో కూడా హరిరామ జోగయ్య అంచనా వేశారు. టిడిపి జనసేన కూటమి జయాపజయాలని నిర్దేశించేది సిఎం పదవి ఎవరిదన్నది మాత్రమేనని జోగయ్య తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో, ప్రజల్లో, చానెల్స్‌లో దీనిపైనే చర్చ జరుగుతోందని జోగయ్య అన్నారు. పవన్ కళ్యాణ్ సిఎం కావాలని కోరుకుంటున్నారని సంఖ్యే ఎక్కువగా ఉందని జోగయ్య తేల్చేశారు. ప్రజలు నూతన పరిపాలన కోరుకుంటున్నారు కానీ పాత చింతకాయ పచ్చళ్ళు కాదని జోగయ్య కుండబద్దలు కొట్టారు.టిడిపి జనసేన విజయం సాధించాలంటే మొదటి ఆప్షన్ ఏంటో జోగయ్య చెప్పేశారు. జనసైనికులేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని, చంద్రబాబు సిఎం కావాలని టిడిపి కార్యకర్తలు కోరుకుంటున్నారని జోగయ్య గుర్తు చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు సంతృప్తి చెంది ఓట్లు ట్రాన్స్‌ఫర్ అయితేనే ఈ కూటమి విజయం సాధించగలుగుతుందని జోగయ్య హెచ్చరించారు. ఇలా కాకపోతే ఓడిపోయినా ఆశ్చర్య పోనక్కర్లేదని జోగయ్య అన్నారు. టిడిపి- జనసేన సీట్లు చెరిసగం.. సిఎం పదవి చెరిసగం పంచుకుని ముందుకెళ్లగలిగితేనే విజయం సాధ్యమవుతుందని జోగయ్య జోస్యం చెప్పారు.
ఇక రెండో ఆప్షన్ విషయానికి వస్తే ఎన్నికలముందు సిఎం ఎవరో నిర్ణయించకుండా అసెంబ్లీ సీట్లని చెరిసగం పంచుకుని ఎన్నికలకి వెళ్ళాలని జోగయ్య సూచించారు. ఎన్నికలు పూర్తయిన తరువాత మాత్రమేసిఎం ఎవరో నిర్ణయించుకుని సంయుక్త పరిపాలన ఏర్పాటు చేసుకోవాలని జోగయ్య హితవు పలికారు. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం ప్రజాపరిపాలన చేపట్టాలని, అలా చేయడం ద్వారా ప్రజల అభీష్టం కూడా నెరవేరుతుందని జోగయ్య తెలిపారు. ఈ ఆప్షన్ కూడా కాదనుకుంటే బిజెపి జనసేన కూటమి కలిసి ప్రయాణం చేయడం ద్వారా వైఎస్సార్ పార్టీని ఓడించడం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోగయ్య విశ్లేషించారు. వైఎస్సార్‌సిపి పరిపాలన పట్ల ఓటర్లు చాలా వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవమని, జగన్ మీటనొక్కే కార్యక్రమానికి ఓటర్లలో పెద్దగా స్పందన లేదని సర్వేలు కూడా చెబుతున్నాయని జోగయ్య వివరించారు. వైఎస్సార్‌సిపి, టిడిపిల గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతూ వస్తోందని జోగయ్య అన్నారు. టిడిపి గత ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సిపి చేస్తున్న విమర్శలతో టిడిపి గ్రాఫ్ పడిపోతోందని జోగయ్య చెప్పారు.
అయితే ఇదే సమయంలో జనసేన పార్టీ ఓట్ల శాతం రోజురోజుకీ పెరుగుతూ వస్తోందని జోగయ్య వెల్లడించారు. అధికారం జనసేనదే అంటూ ప్రయాణం చేయగలిగితే బస్సు యాత్ర పూర్తయ్యే నాటికి ఇది తారాస్థాయికి చేరుతుందని కూడా జోగయ్య అంచనా వేశారు. యువకులు, మహిళలు పవన్ కళ్యాణ్ విజయం పట్ల ఆసక్తి చూపిస్తున్నారని జోగయ్య చెప్పారు. వైఎస్సార్, టిడిపి పార్టీలపై ఉన్న అవినీతి ఆరోపణలతో ఓటర్లలో ఈ రెండు పార్టీలపై పుట్టుకొస్తున్న విరక్తి ఎక్కువగా ఉందని జోగయ్య అన్నారు. నీతివంతుడైన పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరగడానికి ఇది ముఖ్య కారణంగా కనిపిస్తోందని జోగయ్య తెలిపారు.