Mandous Cyclone : మాండూస్ తుఫాను దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు దూసుకోస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం ముందుస్తు చర్యలు చెప్పటింది. ఇవాళ అర్థరాత్రి దాటిన తరువాత మహాబలిపురం వద్ద తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయి. దీంతో తుఫాను ముప్పు పొంచి జిల్లాలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తున్నారు.
కాగా ఇప్పటికే కారణంగా సహాయర చర్యలు చేపట్టేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎపీడీఆర్‌ఎఫ్ ఆయా జిల్లాలో రంగం లోకి దిగాయి. ఏపీతో పాటుగా తమిళనాడు లోని 9 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను రక్షణ, సహాయర చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎపిడిఆర్‌ఎఫ్ బృందాలుగా సిద్దంగా ఉన్నాయి. ప్రకాశం – 2, నెల్లూరు – 3, తిరుపతి – 2, చిత్తూరు – 2 గా సహాయక చర్యలు చేపట్టనున్నారు.
ప్రకాశం జిల్లా : రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా మాండూస్ తుఫాను ప్రభావం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తుగా లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
తిరుపతి జిల్లా : ఈ జిల్లాలో మాండస్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా జిల్లా వ్యాప్తంగా చలి గాలులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈదురు గాలులు వీస్తూండడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి రేషన్ సరుకులను అందుబాటులో ఉంచారు. మండల రెవెన్యూ కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూం లను ఏర్పాటు చేశారు.. మరోవైపు మత్స్యకారులను కూడా ఇప్పటికే సముద్రంలో నుంచి వెనక్కి రప్పించి వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా : తుఫాను ప్రభావంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్ హరినారాయణ్ ప్రజలకు పలు సూచనలను అందించారు. అనవసరంగా బయట తిరగొద్దు, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు, బైక్‌లపై ప్రయాణాలు చేస్తుంటే జాగ్రత్తలు పాటించండి అని తెలిపారు. అదే విధంగా ఇప్పటికే ఈ జిల్లా ప్రజల్ని ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. అదే విధంగా మాండూస్ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి కలెక్టరేట్లలో 9491077356, 0877-2256766, 1077 హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.