Boris Johnson: ఇంత తక్కువ జీతంతో ఎలా బతకాలన్న బోరిస్ జాన్సన్ రూ.38 కోట్లతో ఇల్లు కొన్నారు..

బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చేజేతులా ప్రధానమంత్రి పదవిని కోల్పోయి ప్రస్తుతం మాజీ అయ్యారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే తను మాత్రం తన అధికారిక భవనం 10 డౌనింగ్‌ స్ట్రీట్  మిత్రులతో కలిసి మందుపార్టీలు చేసుకుంటూ బిజీగా గడిపారు

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 03:40 PM IST

Boris Johnson: బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చేజేతులా ప్రధానమంత్రి పదవిని కోల్పోయి ప్రస్తుతం మాజీ అయ్యారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే తను మాత్రం తన అధికారిక భవనం 10 డౌనింగ్‌ స్ట్రీట్  మిత్రులతో కలిసి మందుపార్టీలు చేసుకుంటూ బిజీగా గడిపారు. ఇది కాస్తా మీడియాకు ఎక్కడంతో బ్రిటన్‌ పార్లమెంటులో పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై విచారణ కూడా జరపాలనుకున్నారు తర్వాత బోరిస్‌ సారీతో సరిపెట్టుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం బోరిస్‌ గురించి హాట్‌ టాపిక్‌ బ్రిటన్‌లో చక్కర్లు కొడుతోంది.

38 కోట్లతో ఇల్లు కొనుగోలు..(Boris Johnson)

మాజీ ప్రధానమంత్రిగా తనకు వచ్చే జీతం రెండు లక్షల డాలర్లు.. భారతీయ కరెన్సీ ప్రకారం ఏడాదికి సుమారు 1.6 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ఈ సొమ్ముతో పూట గడిచేదేలా అని బీద అరుపులు అరిచిన.. జాన్సన్‌ ఏకంగా 4.7 మిలియన్‌ డాలర్లు పెట్టి ఓ పురాతన ఇంటిని కొనుగోలు చేయడంతో ప్రజలు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. 4.7 మిలియన్‌ డాలర్ల అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 38 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు ఎవ్వరూ తన ఇంటి వద్దకు రాకుండా ఆయన కందకాలు కూడా తవ్వించారు. ఇక ఈ భవనం విషయానికి వస్తే తొమ్మది బెడ్‌ రూంల ఇళ్లు. 1600 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మకానికి ఉన్నట్టు మిర్రర్‌ పత్రిక వెల్లడించింది. కాగా ఈ భవనానికి ట్యూడర్ మరియు జార్జియన్ ఫీచర్లున్నాయి. అయితే ఈ భవనం కొనుగోలు చేయడానికి ముందు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. వాటిలో ప్రధానమైంది ఏమిటంటే బీబీసీ చైర్మన్‌ రిచర్ట్‌ షార్ప్‌ ఈ భవనం జాన్సన్‌ కొనుగోలు ప్రాసెస్‌ మొదలు కాగానే రాజీనామా చేశారు. ఎందుకంటే తన మిత్రుడు బోరిస్‌ జాన్సన్‌కు ఎనిమిది లక్షల పౌండ్ల రుణం ఇప్పించడానికి ఆయన సాయం చేశారు.

బోరిస్‌ జాన్సన్‌ ఇల్లు కొనుగోలు చేయడానికి ముందు బీద అరుపులు అరిచారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. బతుకు తెరువు కష్టంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే 2,05,444 డాలర్లతో పూట ఎలా గడుస్తుందని అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ఆయన 4.7 మిలియన్‌ డాలర్లు పెట్టి ఆర్స్‌ఫర్డ్‌ షైర్‌ ప్రాంతంలో బ్రైట్‌వెల్‌ మానర్‌ ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ ఇళ్లు 900 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ కోట లాంటి ఇంటిని కింగ్‌ స్టీఫెన్‌ నిర్మించి ఈ ఇంట్లోనే నివాసం ఉన్నారు. ఇక ఇంటి విషయానికి వస్తే 8,128 చదరపు అడుగుల్లో తొమ్మిది బెడ్‌ రూంలు, ఐదు బాత్‌రూంలు కలిగి ఉన్నాయి. ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. దీంతో పాటు గెస్ట్‌ కాటేజీ, ఒక గరాజ్‌, టెన్నిస్‌ కోర్టు, గుర్రపుశాల కూడా ఉంది.

ప్రధానిగా ఉన్నపుడు విచ్చలవిడి ఖర్చులు..

ఇక మాజీ పీఎం బోరిస్‌ జాన్సన్‌ ఈ భవనాన్ని కొనుగోలు చేసిన వెంటనే రాజకీయ దుమారం కూడా చెలరేగింది. లేబర్‌ పార్టీ దీనిపై భగ్గుమంది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సమయంలో డౌనింగ్‌స్ట్రీట్ లో జరిగిన పార్టీపై విచారణ జరిపేందుకు మాజీ ప్రధానమంత్రి లీగల్‌ టీంపై టాక్స్‌పేయర్స్‌ డబ్బు 3,06,764 డాలర్లు వ్యయం చేసినట్లు మండిపడింది. కాగా రిషి సునాక్‌ మాజీ ప్రధానమంత్రి బోరిస్‌కు అండగా నిలిచారు. బోరిస్‌ జాన్సన్‌ పార్టీగేట్‌ బిల్స్‌పన్ను చెల్లింపుదార్లు ఎందుకు భరించాలని లేబర్‌ పార్టీ ప్రశ్నిస్తోంది. కాగా ప్రధానమంత్రిగా బోరిస్‌ జాన్సన్‌ విచ్చలవిడిగా ఖర్చు చేసేవారని ఆయన దగ్గర పనిచేసిన అధికారులు చెబుతుంటారు. ప్రధానమంత్రిగా తనకు వేతనం చాలా తక్కువ చెల్లిస్తున్నారని తరచూ ఫిర్యాదు చేసేవారు. ఎప్పుడూ తనకు డబ్బు సరిపోవడం లేదని వాపోతుండేవారని చెబుతారు. జాన్సన్‌ వెనుక ఆయన సన్నిహితులు ఆయన బీద అరుపులు అరుస్తుంటే జోకులు వేసేవారు.

ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత బోరిస్‌ జాన్సన్‌ మూడు మిలియన్‌ పౌండ్లు ఆదాయం సంపాదించారు. వాటిలో 2.5 మిలియన్‌ పౌండ్లు హారీ వాక్‌ స్పీకింగ్‌ ఏజెన్సీ తన జీవిత అనుభవాలకు సంబంధించి రైట్స్‌ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి 5,10,000 పౌండ్లు అడ్వాన్స్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం బోరిస్‌జాన్సన్‌ తన కుటుంబంతో కలిసి టోరి డోనర్స్‌కు చెందిన ఇంట్లో ఎలాంటి అద్దె చెల్లించకుండా ఉంటున్నారు. లండన్‌లోని నైట్స్‌బ్రిడ్జిలో 20 మిలియన్‌ పౌండ్ల కాటేజీలో ఉచితంగా నివాసం ఉంటున్నారన్న వార్తలు వినవస్తున్నాయి.

మొత్తానికి బోరిస్‌ జాన్సన్‌ కొత్త ఇల్లు కొనుగోలు చేయడం పెద్ద దుమారం రేపుతోంది. బీద అరుపులు అరస్తున్న జాన్సన్‌ ఏకంగా 4.7 మిలియన్‌ డాలర్లు పెట్టి ఇంటిని ఎలా కొనుగోలు చేశారని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. దీని గురించి బోరిస్‌ ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.