Apsara case: పూజారి ప్రియుడి చేతిలో శంషాబాద్‌లో హత్యకు గురైన అప్సర కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకి మూడేళ్ళ కిందట చెన్నైకి చెందిన వ్యక్తితో పెళ్ళైందని పోలీసుల విచారణలో తేలింది. కానీ భర్తతో విబేధాల కారణంగా ఏడాది కిందట సరూర్‌నగర్‌లోని పుట్టింటికి వచ్చింది.
జాతకం కోసం సాయికృష్ణ వద్దకు..(Apsara case)
ఆ సమయంలోనే సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ టెంపుల్‌లో పూజలు చేసే సాయికృష్ణతో అప్సరకి పరిచయం ఏర్పడింది. జాతకం కోసం మొదట సాయి కృష్ణ దగ్గరికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో వివిధ రకాల పూజలతో సాయికృష్ణ అప్సరకు దగ్గరయ్యాడని సమాచారం. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే పెళ్ళి చేసుకోవాలని అప్సర వేధిస్తుండటంతో సాయికృష్ణ ఆమెని చంపేశాడని తేలింది.
వీరిద్దరు గత నవంబరులో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని కూడా సందర్శించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అప్సర వాట్సాప్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. ఒక వేళ తనను పెళ్లి చేసుకోకపోతే రోడ్డుకు ఈడుస్తానంది. అందుకే సాయికృష్ణ ఆమెను అడ్డుతొలగించాలను కుని హత్య చేశాడు. ఇదే విషయాన్ని సాయికృష్ణ కూడా ఒప్పుకొన్నాడు. అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.