YSRCP Leader Kodali Nani Joined In Aig Hospital: మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తొలుత గుడివాడ మాజీ ఎమ్మెల్యేకు గుండెపోటు వచ్చిందని అతని సన్నిహిత వర్గాల నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం వచ్చింది. తొలుత కొడాలి నానికి ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని, దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కానీ ఆయన అనారోగ్యానికి గురయ్యారని మరికొంత మంది చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కాగా, ప్రస్తుతం ఏపీలో చోటుచేసుకుంటున్న పలు వివాదాల నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో కొడాలి నాని చేరగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే, వైద్య పరీక్షలు నిర్వహించగా.. గుండె సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కొడాలి నానికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.