YS Vivekananda Reddy murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన, పిటిషన్ మేరకు ఈ కేసు విచారణ హైదరాబాద్ లో జరుగుతోంది.
2019 మార్చి 19వ తేదీన పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ పెద్దలే ఈ హత్యకు కారకులంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలలముందు జరిగిన ఈ హత్యకేసుపై సాగిన పోలీసుల దర్యాప్తుపై పెద్దగా పురోగతి సాధించలేకపోయింది. మరోవైపు ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే హత్యకేసు దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు.
సీబీఐ విచారణకోసం సుప్రీంను ఆశ్రయించిన సునీతారెడ్డి..(YS Vivekananda Reddy murder case)
తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటికీ తన తండ్రి హత్యకేసు విచారణ ముందుకుసాగడంలేదని డాక్టర్ సునీతారెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. దీనితో ఈ కేసుపై సీబీఐ విచారణ చేయాలంటూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు దీనిపై సీబీఐ విచారణ జరగాలంటూ ఆదేశించింది. దీనితో వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది.
సీబీఐ విచారణకు అడ్డంకులు..
వివేకా హత్య విచారణకు పులివెందుల, కడపలో దిగిన సీబీఐ బృందాలు మొదట్లో ఆశాజనకమైన క్లూలు సాధించాయి. అయితే ఎప్పుడయితే వైసీపీలోని కొందరు పెద్దనేతలు, ప్రజాప్రతినిధుల వివేకానందరెడ్డి హత్య వెనుక ఉన్నారంటూ లీకులు బయటకు వచ్చాయో అప్పటినుంచి సీబీఐ అధికారులు అడ్డంకులు మొదలయ్యాయి. సాక్షులు ఎదురుతిరగడం, సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని, వేధిస్తున్నారంటూ వారిపైనే కేసులు పెట్టడం జరిగింది. వివేకా హత్య వెనుక ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యలు ఉన్నారన్న ఆరో్పణలు సంచలనం కలిగించాయి. వీరికి సీఎం జగన్ మద్దతు ఉందంటూ పలు కధనాలు ప్రచారం అయ్యాయి. ఇటీవల అవినాష్ రెడ్డిని విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు పంపింది.
ఏపీలో విచారించవద్దు.. సునీతారెడ్డి
తన తండ్రి వివేకానందరెడ్డి హత్యకేసును ఏపీ లో విచారించకుండా ఇతర రాష్ట్రాల్లో విచారించాలని సునీతారెడ్డి కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలు చేసారు. దీనితో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కడపనుంచి హైదరాబాద్ కు తరలించారు.
కడప జైలు నుంచి హైదరాబాద్ కు నిందితుల తరలింపు..(YS Vivekananda Reddy murder case)
వివేకానందరెడ్డి హత్యకేసు విచారణకు గాను కడప జైలులో ఉన్న ముగ్గురు నిందితులను ప్రత్యేక వాహనంలో పోలీసులు బందోబస్తు మధ్య హైద్రాబాద్ కు తరలించారు. అనంతరం వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి నేడు కోర్టుకు హాజరయ్యారు.