Janasena Chief Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ట్వీట్ చేశారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై విరుచుపడుతున్న జనసేనాని ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటికి సరైన సమాధానం చెప్పలేని ప్రభుత్వ పెద్దలు పవన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో డీఎస్సీ, బైజూస్ ట్యాబ్ లపై ట్విట్టర్ వేదికగా సర్కార్ ను నిలదీసారు.
ట్రైనింగ్ లేదు.. రిక్రూట్ మెంట్ లేదు..(Janasena Chief Pawan Kalyan)
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు, టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదని విమర్శించారు. కానీ, నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టు వస్తుందన్నారు. బైజూస్ ట్యాబ్‌ల వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రొటోకాల్‌ను పాటించిందా? అని ప్రశ్నించారు. టెండర్‌కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి, ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు, ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు పవన్ కు మద్దతుగా తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. జగన్ సర్కారు.. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు పెట్టి అణిచి వేయాలనుకోవటం అవివేకమని అన్నారు.పవన్ పై కేసు పెట్టడం బుద్దిలేని చర్య అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని బాబు అభ్యంతరం తెలిపారు. జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడాన్ని సమాజం మెత్తం ఖండించాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు.