MLA MS Babu: వైఎస్ఆర్‌సిపి అధినేత జగన్ పై తీవ్రస్దాయిలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విరుచుకుపడ్డారు.. తాను చేసిన తప్పు ఏంటో వైఎస్ జగన్ చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. ఐదేళ్ళుగా ఎప్పుడైనా జగన్ ఒక్కసారి అయినా తమని పిలిచి మాట్లాడారా అని ఎంఎస్ బాబు నిలదీశారు.
దళితులకి అన్యాయం..(MLA MS Babu)
జగన్ చెప్పకముందే తాను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగానని ఎంఎస్ బాబు గుర్తు చేశారు. పార్టీ టికెట్ల విషయంలో దళితులకి అన్యాయం జరుగుతోందని ఎంఎస్ బాబు మండిపడ్డారు. అగ్రవర్ణాల సీట్లు ఒక్కటి కూడా మార్చకుండా కేవలం ఎస్సీ సీట్లే మార్చారని ఎంఎస్ బాబు ఆరోపించారు.తిరుపతి, చిత్తూరు జిల్లా ఓసి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా మార్చలేదు.జగన్ చెప్పిందే చేశాను.ఇప్పుడు నా తప్పంటే ఎలా.? గత ఎన్నికలలో ఐప్యాక్ సర్వే చెబితేనే నాకు టికెట్ ఇచ్చారా అంటూ బాబు ప్రశ్నించారు.అయిదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నాను. ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత అని ఆయన అడిగారు. డబ్బులిస్తే ఐ ప్యాక్ వారు సర్వే రిపోర్టు మార్చి ఇస్తారని అన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లే నడుచుకున్నానని తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.