Jagadish Reddy: దేశంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించిన ఏకైక ప్రభుత్వం తమదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించిన నేపధ్యంలో ఆయన సమాధానమిచ్చారు. నీతి అయోగ్ తమ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ నివేదిక పంపించిందని తెలిపారు.
అవాస్తవ శ్వేత పత్రం..(Jagadish Reddy)
గతంలో కరెంట్ కష్టాలు ఎలా ఉండేవో అందరికీ తెలుసునని.. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రానికి 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి రాష్ట్రం చేరిందన్నారు. గతంలో బోరు బావుల దగ్గరికి వెళ్లి, నీటి మోటర్ల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఇంటింటికీ నీరు అందిస్తున్నామని తెలిపారు. గతంలో కరెంట్ కోతలు భారీగా ఉండేవి.. ఇన్వర్టర్లు, జనరేటర్లతో నెట్టుకొచ్చిన రోజుల నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చుకునే స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు.కావాలనే ఈ ప్రభుత్వం తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. వారు ఏ ఎంక్వైరీకి పిలిచినా తాము సిద్దమని అన్నారు. కావాలని అబద్దాలు ప్రచారం చేస్తే ప్రజలు చూస్తూ ఉన్నారని వారికి అన్ని తెలుసునని అన్నారు. అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం నడవదని అప్పులతో పాటు ఆస్తులను కూడా క్రియేట్ చేశామన్నారు. ప్రభుత్వం ఇచ్చిందంతా అవాస్తవ శ్వేత పత్రమని మండిపడ్డారు.
పదివేలకోట్లు దోచుకున్నారు..
గత ప్రభుత్వం 9 గంటల కూడా ఇవ్వలేదని 24 గంటలు ఇస్తున్నామని అబద్దాలను ప్రచారం చేసుకున్నారని మంత్రి కోమటి రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ రంగంలో భారీ స్కాం జరిగిందని, దోచుకున్న మొత్తాన్ని తిరిగి ఇప్పిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఫ్రీ కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదన్నారు. విద్యుత్ రంగంలో జరిగిన స్కాంపై త్వరలో ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతామని అన్నారు.జగదీశ్ రెడ్డి ఒక్కరే పదివేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 9 గంటల కూడా ఇవ్వలేదని.. 24 గంటలు ఇస్తున్నామని అబద్దాలను ప్రచారం చేసుకున్నారని అన్నారు.