AP CM Jagan: విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్శిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న గిరిజనులకు సర్వదా రుణ పడి ఉంటానని అన్నారు. రూ.830 కోట్లతో నిర్మిస్తున్న యూనివర్శిటీకి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. దోపిడీ నుంచి వారిని కాపాడేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పేదల కోసమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లూ తీసుకొచ్చామని.. ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నామని అన్నారు. మూడోతరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తామన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ ఇస్తున్నామని తెలిపారు.డిజిటల్ క్లాస్‌రూమ్‌లు తీసుకొస్తున్నాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ వస్తోంది. గిరిజనుల విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేసింది. రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. గిరిజన ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చిన విషయాన్నిజగన్ గుర్తు చేసారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పార్టీలు వేరైనా అభివృద్ది విషయంలో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ చొరవ తీసుకోవడంతో గిరిజన వర్శిటీ ఏర్పాటు సాకారమయిందని అన్నారు. ఈ యూనివర్శిటీలో అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెడతామని, వీటితో పేద విద్యార్దులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. రాయపూర్ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోందని ఏపీ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.