Bachupally: మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో.. ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా చత్తీస్ ఘడ్, ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..(Bachupally)
బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం రేవంత్ ప్రకటించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మల్కాజ్ గిరి ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ పరిశీలించారు. గోడ నిర్మించిన ప్రాంతంలో పక్కనే క్షతగాత్రులు షెడ్ వేసుకున్నారని. భారీ వర్షం కారణంగా గోడకూలి షెడ్ పై పడిందని తెలిపారు. ఈ ప్రమాదంలో 7 మంది మరణించారని పలువురికి గాయాలు అయ్యాయని వివరించారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
బేగంపేట నాలాలో రెండు మృతదేహాలు..
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. భారీ వర్షాల కారణంగా బేగంపేట డ్రెయిన్‌లో రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి..హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో విద్యుదాఘాతంతో పండ్ల వ్యాపారి మృతి చెందగా, సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలంలో పిడుగుపాటుకు ఓ యువ రైతు మృతి చెందాడు. మెదక్ జిల్లా రాయిలాపూర్ గ్రామంలో గోడ కూలిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు.