Undavalli Arun Kumar: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిల్ వేశారు.
ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యర్థించారు. 241 కోట్ల నిధులు దారిమళ్లాయని దానికి సంబంధించిన పత్రాలను కోర్టుకు అందజేశారు. సీమెన్స్ ఇండియా గుజరాత్ ఎంఒయు లో పెట్టిన పేరు సంతకం, ఆంధ్ర ప్రదేశ్‌లో పెట్టిన పేరు సంతకం వేరు వేరుగా ఉన్నాయని, ఇది దురుద్దేశ పూర్వకంగా , కుట్రపూరితంగా చేశారని ఉండవల్లి ఆరోపించారు.మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం పోరాడుతున్న సంగతి తెలిసిందే. కంపెనీ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ఏళ్ల తరబడి చిట్ ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. చిట్‌ల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తన గ్రూపులోని ఇతర సంస్థలకు మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కస్టడీ పిటిషన్‌పై తీర్పుని విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. రెండున్నర గంటలకి తీర్పు ఇస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. బాబు క్వాష్ పిటిషన్‌పై ఈ మధ్యాహ్నం ఒకటిన్నరకి హైకోర్టు తీర్పు ఇవ్వనుందని చంద్రబాబు లాయర్లు చెప్పడంతో ఏసీబీ కోర్టు తీర్పుని వాయిదా వేసింది. రిమాండ్ సమయం ముగియడంతో కోర్టు ముందు బాబు వర్చువల్‌గా హాజరు పరిచారు. చంద్రబాబుతో జడ్జి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రిమాండులో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా?
మిమ్మల్ని సిఐడి కస్టడీకి అడుగుతోంది. మీకేమైనా అభ్యంతరాలున్నాయా.? అంటూ జడ్జి చంద్రబాబు ప్రశ్నించారు. నన్ను అకారణంగా జైల్లో పెట్టారు.నా గురించి దేశమంతా తెలుసని చంద్రబాబు చెప్పారు. దీనిపై జడ్జి చట్టం ముందు అందరూ సమానులేనని కేసు దర్యాప్తులో అన్నీ తేలుతాయని అన్నారు.