TTD Employee:వైసీపీ నేత వేధింపులు తాళలేక టీటీడీ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను సూసైడ్ నోట్‌లో రాశారు. ఈ ఘటన పేరూరులో తీవ్ర కలకలం రేపింది. పేరూరుకు చెందిన మునస్వామికి స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలోని కొంత స్థలంలో వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ వెంచర్ మీదుగా మిగిలిన పొలంలోకి దారి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో స్థానిక వైసీపీ నేత చెంచుమోహన్‌యాదవ్ ఆ వెంచర్‌లో స్థలం కొనిపించాడు.
దారిని తవ్వించి. వాటర్ కనెక్షన్ తొలగించి..( TTD Employee)
అయితే పొలం దారి వల్ల వెంచర్‌లో కొనుగోలు చేసిన స్థలానికి వీధిపోటు ఉందని వైసీపీ నేత భావించాడు. ఈ క్రమంలో జేసీబీతో దారిని తవ్వించాడు. వెంచర్‌లోని ఇళ్లకు 20 రోజులుగా వాటర్ కనెక్షన్‌ను చెంచుమోహన్ తొలగించాడు. దీంతో నీటి సదుపాయం లేక వెంచర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్న పలు కుటుంబాలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మునస్వామికి చెందిన ఇంటికి వెళ్లే దారిని కూడా చెంచుమోహన్‌యాదవ్ జేసీబీతో తవ్వించాడు. బయటకు వెళ్లేందుకు దారిలేక మునస్వామి తీవ్రమనోవేదన చెందాడు. సమస్యను మునస్వామి కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం లేకపోవడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రసుత్తం మునస్వామి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.