TSRTC: తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె ప్రతిపాదనని విరమించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2773 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. పెరిగిన ప్రయాణీకులతో డీజిల్ ఖర్చు ఎక్కువైందని అద్దె బస్సు ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా చెల్లింపులు చేయాలని అద్దె బస్సు ఓనర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలని పరిష్కరించకపోతే రేపటినుంచి సమ్మెకి దిగుతామని అద్దె బస్సు ఓనర్లు అల్టిమేటం ఇచ్చారు.
సజ్జనార్ హామీ..(TSRTC)
దీంతో ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో ఎండి సజ్జనార్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమ్మె ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. అద్దె బస్సు యజమానుల సమస్యల పరిష్కారంకోసం ఓ కమిటీ వేస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. వారం రోజులలోపే సమస్యలన్నీ పరిష్కరిస్తామని సజ్జనార్ చెప్పారు. దీనికి అద్దెబస్సుల యజమానులు అంగీకరించారు. సమ్మె విరమిస్తున్నామని సజ్జనార్‌కి చెప్పారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్సు సర్వీసులు నడుస్తాయని సజ్జనార్ మీడియాకి చెప్పారు. టీఎస్సార్టీసీ అద్దె బస్సు యజమానులు లేవనెత్తిన ప్రధాన ఆందోళనలలో మహిళలకు ఫ్రీ జర్నీ బస్సుల్లో రద్దీకి, మైలేజ్ సమస్యలకు దారితీస్తుంది.ప్రమాదాల విషయంలో తగినంత బీమా కవరేజీ గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన మహాలక్ష్మి పథకం తెలంగాణ మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్లు, టిఎస్‌ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా అనేక ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.మొదటి రెండు వాగ్దానాలు ఇంకా అమలు కానప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికే టిఎస్‌ఆర్‌టిసి బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. టిఎస్‌ఆర్‌టిసి ప్రకారం, మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి, రాష్ట్రంలోని సుమారు 6.50 కోట్ల మంది మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని పొందారు.