Telangana News: నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో షర్మిల బస్సుపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసి నిప్పుపెట్టారు. అనంతరం వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు తగలబెట్టిన షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఈ ఘటనపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. దాడిని పిరికిపంద చర్యగా విమర్శించారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి కుట్రపూరింతంగా స్థానిక ఎమ్మెల్యే ఇలా దాడులు చేయించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడులతో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆదివారం నర్సంపేట సభలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. “ఒకప్పుడు ట్రాక్టర్ నడిపే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎదిగిండు. భార్యాభర్తలిద్దరూ ఎమ్మెల్యేలట, ఇద్దరూ సంపాదిస్తారట. భూకబ్జాలట, పోస్టింగులకు కమీషన్లట. పంట నష్టపోతే కనీసం సాయం చేయని ఈ ఎమ్మెల్యే ఇక ఉండి ఎందుకు? అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు.