Panjagutta Police Station:హైదరాబాద్ పోలీసు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని మార్చివేసారు. . ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ బదిలీ చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం పోలీసులను ఏఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు.
కమీషనర్ ఆగ్రహం..(Panjagutta Police Station)
భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ వ్యవహారంతో పాటు కీలక విషయాలు లీకేజీ కావడంపై కమీషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లోని మాజీ ప్రభుత్వాధికారులకు సమాచారం చేరవేసినట్లు ఆరోపణల నేపథ్యంలో సిబ్బంది అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు 82 మంది సిబ్బందిని సీపీ కేటాయించారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల నుంచి పంజాగుట్ట పీఎస్‌కు కొత్త సిబ్బందిని నియమించారు. రిమాండ్ ఖైదీలను కోర్టుకు తరలించేటపుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఖైదీల బంధువులతో మిలాఖత్ అవడం, పోలీసు స్టేషన్ కు వచ్చేవారి పట్ల అనుచిత ప్రవర్తన, సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కి సంబంధించి లీకులు ఇలా పలు అంశాలు పంజాగుట్ట పోలీసు స్టేషన్ పై దృష్టి సారించడానికి కారణమయ్యాయని తెలుస్తోంది. మొత్తంమీద ఒక పోలీసు స్టేషన్లో ఇంతమందిని ఒకే సారి బదిలీ చేయడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని మాత్రం చెప్పవచ్చు.