JP Nadda: ఏపీలో కూటమి విజయం ఖాయమని ప్రజల ఉత్సాహం చూస్తుంటే అర్థమవుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో రోడ్‌షో నిర్వహించారు.ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ దేశాభివృద్ధికి మోదీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు.
తిరుపతిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం..(JP Nadda)
తిరుపతి ఎంతో గొప్ప పుణ్యక్షేత్రమని.. మోదీ ఈ నగరాన్ని ఐటీ కేంద్రంగానూ తీర్చిదిద్దుతారన్నారు. మేము అధికారంలోకి వస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని నడ్డా తెలిపారు . ఈ రోడ్ షోలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు. నారా లోకేశ్ మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి సహా రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని విమర్శించారు. వైకాపా పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేదన్నారు. జగన్ నిర్వాకంతో కొత్త కంపెనీలు రావడం సంగతి పక్కన పెడితే.. ఉన్న కంపెనీలూ తరలిపోయాయని ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, దందాలు జరుగుతున్నాయన్నారు. భూమన కుటుంబానికి డబ్బులు ఇస్తే తప్ప పనులు జరగడం లేదని ఆరోపించారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, లోక్‌సభ అభ్యర్థి వరప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు